ఇరాన్‌ యుద్ధం.. చైనాకు ట్రంప్‌ వార్నింగ్‌ | Donald Trump warns China over possible Iran arms shipment | Sakshi
Sakshi News home page

ఇరాన్‌ యుద్ధం.. చైనాకు ట్రంప్‌ వార్నింగ్‌

Apr 12 2026 8:30 AM | Updated on Apr 12 2026 10:30 AM

Donald Trump warns China over possible Iran arms shipment

వాషింగ్టన్‌: పశ్చిమాసియాలో యుద్ధం ముగించేందుకు ఓవైపు పాకిస్తాన్‌లో ఇరాన్‌, అమెరికా చర్చలు జరుగుతున్న వేళ చైనాకు అధ్యక్షుడు ట్రంప్‌ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్‌కు చైనా ఆయుధ సాయం చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్‌ ఇచ్చారు. చైనా ఇరాన్‌కు ఆయుధాలు పంపితే, పెద్ద సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. కాగా, ట్రంప్‌.. మియామీ ప్రయాణానికి ముందు విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

అయితే, ఇరాన్‌కు మిత్రదేశం చైనా నుంచి గగనతల రక్షణ వ్యవస్థలను రహస్యంగా తెప్పించుకుంటోందని అమెరికా నిఘా వర్గాలు తాజాగా ఆరోపించాయి. ఈ మేరకు సీఎన్‌ఎన్‌ వార్తాసంస్థ ఒక కథనం ప్రచురించింది. భుజంపై మోస్తూ సులభంగా ఎక్కడికైనా తీసుకెళ్లగల మ్యాన్‌ప్యాడ్‌ ఆయుధాలను ఇరాన్‌కు చైనా తరలిస్తోందని అమెరికా నిఘా వర్గాలు తెలిపాయి. మ్యాన్‌ప్యాడ్‌ సాయంతో శత్రువుల హెలికాప్టర్లు, డ్రోన్లను కూల్చేయవచ్చు. హెలికాప్టర్ల ఇంజిన్లు, డ్రోన్ల వేడిమిని గుర్తించే ‘హీట్‌–సీకింగ్‌’సాంకేతికతతో ఇది పనిచేస్తుంది. అమెరికా ఎఫ్‌–15ఇ యుద్ధ విమానం, బ్లాక్‌హాక్‌ హెలికాప్టర్లను ఇరాన్‌ ఇటీవల ఇవే యాంటీ–ఎయిర్‌–మిస్సైళ్ల వ్యవస్థలతో నేలకూల్చిందని కథనాలు వెలువడ్డాయి.

నేరుగా పంపకుండా వేరే దేశానికి వీటిని విక్రయించి ఆ దేశం నుంచి ఇరాన్‌ కొనుగోలుచేసేలా వ్యూహం రచించిందని సమాచారం. చైనా అంతర్జాతీయ ఆంక్షల కొరడా దెబ్బల నుంచి తప్పించుకుంటోందని అమెరికా ఆరోపించింది. రష్యా నుంచి సైతం ఇలాగే పనిచేసే వెర్బా అనే యాంటీ–ఎయిర్‌ మిస్సైళ్ల వ్యవస్థలను ఇరాన్‌ కొనుగోలుచేస్తోందని వార్తలొచ్చాయి. ఘన రాకెట్‌ ఇంధనం తయారీవాడే ముడిపదార్థం సోడియం పర్‌క్లోరేట్‌తో నిండిన రెండు సరుకు రవాణా నౌకలను ఇప్పటికే ఇరాన్‌కు చైనా పంపిందని తెలుస్తోంది.

మరోవైపు.. ట్రంప్‌ హెచ్చరికలపై చైనా స్పందించింది. ఈ ఆరోపణలను చైనా ఖండించింది. ఈ సందర్బంగా వాషింగ్టన్‌లోని చైనా రాయబారి కార్యాలయం స్పందిస్తూ.. “మేము ఎప్పుడూ యుద్ధంలో ఉన్న ఏ పక్షానికీ ఆయుధాలు ఇవ్వలేదు” అని స్పష్టం చేసింది. కాగా, ఇరాన్‌కు చైనా, రష్యా ప్రధాన వ్యూహాత్మక భాగస్వాములు. పాశ్చాత్య ఆంక్షల మధ్య వీరి మద్దతు ఇరాన్‌కు కీలకంగా మారింది. అమెరికా మాత్రం ఈ సహకారాన్ని పెద్ద తప్పుగా పరిగణిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement