వసూల్‌ రాజాలు | - | Sakshi
Sakshi News home page

వసూల్‌ రాజాలు

Apr 12 2026 2:42 AM | Updated on Apr 12 2026 2:42 AM

వసూల్‌ రాజాలు

వైద్యారోగ్య శాఖలో

వెలుగు చూసిన ఉద్యోగుల అక్రమాలు

తనిఖీల పేరుతో అక్రమ వసూళ్లు

జిల్లాలో ప్రైవేటు ఆస్పత్రుల నుంచి రూ.వేలల్లో వసూలు

అరసవల్లి:

వైద్యారోగ్య శాఖలో తనిఖీల పేరిట అక్రమ వసూళ్ల దందా నడుస్తోంది. కొందరు ఉద్యోగులు విధులను పక్కన పెట్టి మరీ వసూళ్లకు తెగబడుతున్నారు. జిల్లాలో వివిధ ఆస్పత్రుల్లో పరిస్థితులు, ధ్రువీకరణ పత్రాల పరిశీలన, రెన్యువల్స్‌ పేరుతో అధికారిక బృందం ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబ్‌లు, స్కానింగ్‌ సెంటర్లను తనిఖీలు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ నిర్దేశిత రుసుమును వసూలు చే యాల్సి ఉంటుంది. పీరియాడికల్‌గా కొన్ని ఆస్పత్రులకు జిల్లా వైద్యారోగ్యశాఖాఽధికారి కార్యాల యం నుంచి నేరుగా నోటీసులు జారీ అవుతాయి. అయితే ఇదే అదనుగా నోటీసులు జారీకానున్న ఆస్పత్రులకు కొందరు సంబంధం లేని విభాగ ఉద్యోగులు కూడా బృందంగా ఏర్పడి అక్రమ వసూళ్లకు తెగబడుతున్నారని విశ్వసనీయ సమాచారం. ఇదే విషయం గత ఆరు నెలల నుంచి జిల్లాలో పలు డివిజన్లలో జరుగుతుందని, జిల్లా కేంద్రం నుంచి వెళ్లి ధ్రువీకరణ పత్రాల పరిశీలన పేరుతో శానిటేషన్‌ విభాగ పనితీరు పేరుతో వసూళ్లకు దిగుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు ఫిర్యాదులు చేయడానికి సిద్ధపడ్డారు. సీసీ కెమెరాల ఫుటేజీలతో కూడిన ఆధారాలతో డీఎంహెచ్‌ఓకు ఫిర్యాదు చేయనున్నారని తెలుస్తోంది. తాజాగా పాతపట్నం, ఆమదాలవలస, నరసన్నపేట, పలా స, టెక్కలి తదితర చోట్ల ప్రైవేటు ఆస్పత్రుల్లో తనిఖీల పేరిట రూ.వేలల్లో వసూలు చేసిన వ్యవహారం ఇప్పుడు జిల్లా కేంద్రంలో హాట్‌టాపిక్‌ అయ్యింది.

ప్రొగ్రాం ఆఫీసర్లు లేకుండానే తనిఖీలా..

జిల్లాలో వివిధ ఆస్పత్రుల్లో నాణ్యమైన వైద్య పరికరాలు, రసాయనాలతో పరీక్షలు జరిగేలా, అలాగే ప్రభుత్వ నిర్దేశిత ధరల అమలు, శానిటేషన్‌, ఫైర్‌ సేఫ్టీ, ఆస్పత్రులు, క్లినిక్‌లు, ల్యాబ్‌ల నిర్వహణకు పక్కాగా ధ్రువీకరణ పత్రాలు, అనుమతులన్నీ ఉండాలి. అయితే ప్రతి ఐదేళ్లకు ఒకసారి ధ్రువీకరణ పత్రాల రెన్యువల్స్‌ కూడా జరగాల్సి ఉంది. వీటి తనిఖీలకు డిస్ట్రిక్ట్‌ ఎక్స్‌టెన్షన్‌ మాస్‌మీడియా అధికారి (డెమో) ఆధ్వర్యంలో వైద్యశాఖకు చెందిన కీలకమైన ఐదు ప్రొగ్రాం ఆఫీసర్ల పర్యవేక్షణలో ఈ తనిఖీలను నిర్వహించాల్సి ఉంటుంది. అయితే జిల్లా వైద్యారోగ్యశాఖాఽధికారి ఆదేశాల మేరకు ప్రతి నెల 30 వరకు ఒక్కో ప్రొగ్రాం అధికారితో కూడిన బృందానికి ఈ తనిఖీల బాధ్యతలను అప్పగిస్తుంటారు. అయితే ఎలాంటి ప్రొగ్రాం ఆఫీసర్ల ప్రమే యం లేకుండానే నాన్‌ కమ్యూనికేబుల్‌ డిసిజెస్‌ (ఎన్‌సిడి)/ రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమ్‌ (ఆర్‌బిఎస్‌కె) ప్రొగ్రాంలకు చెందిన కొందరు ఉద్యోగు లు దర్జాగా కలెక్షన్లు చేసేశారు. తనిఖీల నిర్వహణ లో సంబంధం లేని వాళ్లు, కొత్త ల్యాబ్‌లు, ఆస్పత్రు లు కనిపిస్తే అనుమతుల పేరిట కూడా వసూలు చేస్తున్నారు. ఈ అక్రమ వసూళ్ల వ్యవహారంలో కొద్ది నెలల క్రితమే ఓ ప్రొగ్రాం ఆఫీసర్‌ కూడా విపరీతంగా ప్రైవేటు ఆస్పత్రుల్లో కలెక్షన్లు చేసిన సంగతి విదితమే. దీనిపై ఫిర్యాదులు రావడంతో ఈయనకు కేవలం ప్రభుత్వ ఆస్పత్రులకు మాత్రమే పరిశీలన చేయాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ అనిత ఆదేశించారు. అయితే మళ్లీ ఇప్పుడు రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమ్‌ (ఆర్‌బిఎస్‌కె) ప్రొగ్రాంకు చెందిన ఓ ‘అక్రమ నాయుడు’ వసూళ్ల దందా వ్యవహారం తెరమీదకు వచ్చింది. నెలకు రూ.60 వేల నుంచి రూ.80 వేల వరకు వసూలు చేసినట్లుగా తెలుస్తోంది. దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు చేపట్టాలని ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యం విజ్ఞప్తి చేస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement