ట్రంప్ ‘మ్యాజిక్ పెయింట్’.. మండిపడుతున్న నిపుణులు | What is magic paint Trump wants to cover White House | Sakshi
Sakshi News home page

ట్రంప్ ‘మ్యాజిక్ పెయింట్’.. మండిపడుతున్న నిపుణులు

Apr 12 2026 9:15 AM | Updated on Apr 12 2026 10:20 AM

What is magic paint Trump wants to cover White House

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన విభిన్నమైన నిర్ణయాలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. రెండోసారి అధికార పీఠం ఎక్కిన తర్వాత తన ప్రత్యేకమైన అభిరుచి మేరకు వైట్‌హౌస్ పరిసరాల రూపురేఖలు మార్చేయాలని డిసైడ్ అయ్యారు. అందుకోసం ఆయన ఏకంగా ‘మ్యాజిక్ పెయింట్’ అనే కొత్త అస్త్రాన్ని తెరపైకి తెచ్చారు. చారిత్రక ప్రాధాన్యం ఉన్న ఒక అద్భుత భవనానికి ఈ రంగు వేయాలన్న ఆయన నిర్ణయం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది.

1888లో గ్రానైట్ రాయితో నిర్మించిన ఐసెన్‌హోవర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ బిల్డింగ్ వైట్‌హౌస్‌కు ఆనుకునే ఉంటుంది. జాతీయ భద్రతా మండలి, ఉపాధ్యక్షుడి కార్యాలయాలు ఇక్కడే ఉన్నాయి. 553 విశాలమైన గదులు, అద్భుతమైన చెక్క అలంకరణలు, చేతితో చిత్రించిన టైల్స్ ఉన్న ఈ సువిశాల భవనానికి పూర్తి తెలుపు రంగు వేయాలని ట్రంప్ పట్టుబడుతున్నారు. దీనికోసం సిలికేట్‌తో కూడిన మ్యాజిక్ పెయింట్ వాడాలని ఆయన సూచిస్తున్నారు. ఈ రంగు కారణంగా రాతి గోడలు మరింత దృఢంగా మారుతాయని, మరకలు పడవని, భవిష్యత్తులో మళ్లీ  రంగు వేసే పని ఉండదని వైట్‌హౌస్ వర్గాలు చెబుతున్నాయి. 1800ల చివరి నుండి ఈ భవన నిర్వహణను నిర్లక్ష్యం చేశారని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఫైన్ ఆర్ట్స్ కమిషన్‌కు నివేదికలు సమర్పించారు.

అయితే ఈ ప్రతిపాదనను చరిత్రక కట్టడాల పరిరక్షణ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం ట్రంప్ చెబుతున్న సిలికేట్ మ్యాజిక్ పెయింట్ ఆ గ్రానైట్ భవనానికి ఏమాత్రం సరిపడదు. ఈ పెయింట్ వాడటం వల్ల చరిత్రక భవనానికి ముప్పు వాటిల్లుతుందని, పైగా ఇది చట్టవిరుద్ధమని సాంస్కృతిక వారసత్వ భాగస్వామ్య పక్షాలు కోర్టును ఆశ్రయించాయి. ఎన్ని అడ్డంకులు వస్తున్నా ట్రంప్ ప్రతిపాదన మాత్రం ముందుకు సాగుతుండటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఇది కూడా చదవండి: సిలిండర్ కథ కంచికి.. హైడ్రోజన్ పొయ్యి మన ఇంటికి!

Advertisement
 
Advertisement
Advertisement