● రూ. కోటికి పైగా నగదుతో ఉడాయించిన వైనం ● లబోదిబోమంటున్న బాధితులు
సంతబొమ్మాళి:
ప్రజల నమ్మకాన్ని పెట్టుబడిగా మార్చుకున్న ఓ వ్యాపారి నగదు, బంగారం పట్టుకుని ఉడాయించిన ఘటన మండలంలోని బోరుభద్రలో చేటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే మండలంలోని బోరుభద్రలో పోలాకి మండలం పిన్నింటిపేటకు చెందిన పొట్నూరు కృష్ణారావు 30 ఏళ్లుగా వెంకట భగవాన్ పేరుతో మెడికల్ షాపు నడుపుతున్నారు. మెడికల్ షాపులో మందులు అమ్ముతూ చాలా కాలం నుంచి వడ్డీకి డబ్బులు అప్పులు ఇస్తున్నారు. బంగారు వస్తువులు తనఖాగా ఉంచుకుని డబ్బులు అప్పుగా ఇస్తుంటారు. అయితే గత కొన్నేళ్లుగా తన మరదలి కుమారుడైన పొట్నూరి నానిని బోరుభద్ర తీసుకువచ్చి మెడికల్ షాపు వ్యాపారం అప్పగించాడు. కృష్ణారా వు మకాం నరసన్నపేటకు మార్చి అక్కడ వేరే వ్యాపారాలు చేస్తూ అప్పుడప్పుడూ బోరుభద్ర వచ్చి షాపు లెక్కలు చూసి వెళ్లిపోయేవాడు. అయితే అప్పటి నుంచి బంగారం వస్తువుల తనఖా వ్యాపారాన్ని నాని చూసుకుంటూ అందరితో నమ్మకంగా మెలిగేవాడు. అయితే గత కొద్ది రోజులుగా బంగా రం వస్తువులు తనఖా పెట్టిన వారు డబ్బులు తీసుకువచ్చి తమ వస్తువులు ఇవ్వమని అడగ్గా వేరే వారి వద్ద ఉన్నాయని నాని తిప్పుతున్నాడు. మరికొంతమంది వద్ద డబ్బులు తీసుకొని నెలలు కావస్తున్నా బంగారం తిరిగి ఇవ్వకుండా కాలయాపన చేస్తుండడంతో బాధితులు గట్టిగా నిలదీశారు. దీంతో గురువారం మెడికల్ షాపునకు తాళాలు వేసి నాని పరారైపోయాడని స్థానికులు చెబుతున్నారు. నాని ఈ ప్రాంతంలో రూ. 30లక్షలు వరకు అప్పులు చేశాడని, మరికొందరి వద్ద నెలకు నూటికి రూ. 10లు వరకు వడ్డీకి అప్పులు వాడాడని సమాచారం. డబ్బులతో పాటు తనఖా పెట్టిన 50తులాల బంగా రం వస్తువులను తీసుకుని మెడికల్ షాపు మూసి పరారు కావడంతో బాధితులు లబోదిబోమంటు న్నారు. మోసపోయిన వారిలో బోరుభద్ర, గొద లాం, మలగాం, పాలతలగాం, శిమ్మయ్యపేట, కొల్లిపాడు, గెద్దలపాడు, పిట్టవానిపేట, పాత మేఘవరం బాధితులు ఉన్నారు. పిట్టవానిపేట గ్రామాని కి చెందిన పిట్ట చిన్నమ్మ రెండున్నర తులాలు, మలగాంకు చెందిన లండ వరలక్ష్మి అరతులం, చిన్నమ్మి ఐదుతులాల బంగారాన్ని తాకట్టు పెట్టా మని డబ్బులు ఇస్తామన్నా నెలలు తరబడి ఇవ్వకపోవడంతో పాటు పరారు కావడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సంతబొమ్మాళి ఎస్‌ఐ వై. సింహాచలంకు అడుగగా ఎవరూ లిఖిత పూర్వంగా ఫిర్యాదు చేయలేదని తెలిపారు.


