వాషింగ్టన్: అమెరికాలో దీర్ఘకాలంగా నివాసముంటున్న ఇరాన్ ప్రస్తుత, మాజీ సీనియర్ అధికారుల సంబంధీకుల గ్రీన్‌కార్డులను ట్రంప్ ప్రభుత్వం రద్దు చేస్తోంది. తాజాగా, లాస్‌ఏంజెలెస్‌కు చెందిన సైకాలజీ ఉపాధ్యాయుడు సయ్యద్ ఈసా హషేమీ, ఆయన భార్య, కుమారుడి గ్రీన్‌కార్డులను రద్దు చేసినట్లు విదేశాంగ శాఖ తెలిపింది.
అయితే, వీరంతా ఇరాన్‌లో జన్మించి, అమెరికాలో చట్టబద్ధమైన శాశ్వత నివాస హోదా కలిగిన వారని వివరించింది. వీరిని నిర్బంధంలోకి తీసుకున్న అధికారులు త్వరలోనే స్వదేశానికి పంపనున్నారని తెలిపింది. 1979లో టెహ్రాన్‌లోని అమెరికా ఎంబసీపై దాడి చేసిన వారికి ప్రతినిధిగా వ్యవహరించిన మసౌమె ఎబ్తెకర్ కుమారుడే హషేమీ. అనంతరం మసౌమె ఇరాన్ మొట్టమొదటి మహిళా ఉపాధ్యక్షురాలయ్యారు.
కాగా, 2020లో బాగ్దాద్‌పై అమెరికా దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ మాజీ చీఫ్ కసెమ్ సొలెమానీ కుటుంబీకుల గ్రీన్ కార్డులను గత వారం విదేశాంగ శాఖ రద్దు చేయడం తెల్సిందే. పాకిస్తాన్‌లో అమెరికా, ఇరాన్ ప్రతినిధుల మధ్య శాంతి చర్చలు జరుగుతున్న వేళ ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.


