అటకెక్కిన ‘రింగు’.. ఎన్‌హెచ్‌ఏఐ కీలక నిర్ణయం! | NHAI Key Decision On Telangana RRR Project | Sakshi
Sakshi News home page

అటకెక్కిన ‘రింగు’.. ఎన్‌హెచ్‌ఏఐ కీలక నిర్ణయం!

Apr 12 2026 11:37 AM | Updated on Apr 12 2026 11:46 AM

NHAI Key Decision On Telangana RRR Project

ట్రిపుల్‌ ఆర్‌ ఉత్తర భాగానికి దక్కని ఆమోదం

ఆర్థిక సంవత్సరం ముగిసిపోవటంతో ఇప్పట్లో అనుమతి కష్టమే 

టెండర్ల రద్దు యోచనలో ఎన్‌హెచ్‌ఏఐ

సాక్షి, హైదరాబాద్‌: గేమ్‌ ఛేంజర్‌ అంటూ ట్రిపుల్‌ ఆర్‌ (రీజినల్‌ రింగురోడ్డు) విషయంలో అదిగో ఇదిగో అంటూ ఊరించి ప్రస్తుతానికి ఆ ప్రాజెక్టును కేంద్రం అటకెక్కించింది. దాదాపు ఏడాది క్రితమే ప్రాజెక్టు కోసం టెండర్లు పిలిచిన కేంద్ర ప్రభుత్వం, 2025–26 ఆర్థిక సంవత్సరంలో దానికి ఆమోదం తెలపలేదు. ఆర్థిక సంవత్సరం ముగిసిపోవటంతో ఏకంగా ఆ టెండర్లనే రద్దు చేసుకునే దిశగా యోచిస్తోంది.

కొత్త ఆర్థిక సంవత్సరం ఇప్పుడు మొదలైనందున, ఈ ఏడాది కాలం సమయం ఉంది. దీంతో ప్రాజెక్టును పక్కన పెట్టేసినట్టుగానే తెలుస్తోంది. ప్రస్తుతానికి టెండర్లు తెరిచే గడువును మరో రెండు నెలలకు పొడిగించింది. ఆ తర్వాత రద్దు చేసి నవంబరు నాటికి కొత్త టెండర్లు పిలుస్తారన్న మాట వినిపిస్తోంది. వెరసి, రీజినల్‌ రింగురోడ్డు ఉత్తర భాగం పనులు ఇప్పట్లో మొదలు కావు.  

ప్రయారిటీ జాబితాలో లేకపోవటమే... 
ట్రిపుల్‌ ఆర్‌ రెండు భాగాలు పూర్తి చేసేందుకు దాదాపు రూ.40 వేల కోట్లు ఖర్చు కానున్నాయి. అందులో ప్రస్తుతానికి ఉత్తర భాగాన్ని మాత్రమే కొలిక్కి తెస్తున్నందున, దానికి రూ.18 వేల కోట్ల వరకు ఖర్చు కానుంది. దేశవ్యాప్తంగా ఎక్స్‌ప్రెస్‌ వేలు, జాతీయ రహదారుల విస్తరణపై ఫోకస్‌ చేస్తున్న కేంద్రం వాటిని ప్రయారిటీ లిస్టులో చేర్చుకొని పనులు మొదలుపెడుతోంది. ట్రిపుల్‌ ఆర్‌ ప్రయారిటీ జాబితాలో లేదు. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలు, రాజకీయంగా లాబీయింగ్‌ చేస్తున్న రాష్ట్రాల్లోని ప్రాజెక్టులకు వీలు చిక్కుతోంది. గతంలో భారత్‌మాల పరియోజనలో ట్రిపుల్‌ ఆర్‌ను చేర్చి వేగంగా టెండర్ల ప్రక్రియ వరకు తెచ్చినా, నాటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి–కేంద్రానికి మధ్య ఆ ప్రాజెక్టు భూసేకరణ డబ్బు డిపాజిట్‌ చేసే విషయంలో పేచీ నెలకొని మాటల యుద్ధానికి దారి తీసింది.

దీంతో ట్రిపుల్‌ ఆర్‌ను అప్పట్లో ప్రయారిటీ జాబితా నుంచి కేంద్రం తొలగించింది. ఇప్పటికీ దాదాపు అదే పరిస్థితి కొనసాగుతోంది. టెండర్లు పిలిచినా, కేంద్ర ఆర్థిక వ్యవహారాల కమిటీ ఆధ్వర్యంలోని పబ్లిక్‌ ప్రైవేట్‌ పార్ట్‌నర్‌íÙప్‌ అప్రైజల్‌ కమిటీ ఆమోద ముద్ర వేయలేదు.కేంద్ర ఆర్థిక శాఖ పర్యవేక్షణలో ఉండే ఈ కమిటీ ఆమోద ముద్ర వేస్తేనే ఆ ప్రాజెక్టుకు బడ్జెట్‌ విడుదలవుతుంది. ఆ ఆమోదం లేకుంటే టెండర్లను ఖరారు చేయటం కుదరదు. ట్రిపుల్‌ ఆర్‌ ఉత్తర భాగానికి ఇప్పుడు ఆ కమిటీ ఆమోదం లభించాల్సి ఉంది. బడ్జెట్‌ విడుదల కాకపోయేసరికి టెండర్లను ఖరారు చేయలేక అరడజను మార్లు గడువు పొడిగిస్తూ ఎన్‌హెచ్‌ఏఐ కాలయాపన చేయాల్సి వస్తోంది.  

ఖర్చు తగ్గించాలని.... 
రింగురోడ్డుకు భారీగా ఖర్చు చేయాల్సి రావటాన్ని కూడా ఇటీవల సమీక్షించిన కేంద్ర ఆర్థిక శాఖ, ఖర్చును తగ్గించాల్సిందిగా కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖకు సూచించింది. ఆమేరకు ఆ శాఖ కార్యదర్శి పలు దఫాలు సమావేశమై, చాలా ప్రత్యేకతల్లో కోత విధించారు. ఏకంగా ఎనిమిది వరుసల రోడ్డును ఆరు వరుసలకే కుదించారు. సర్వీసు రోడ్డు ఆప్షన్‌ తొలగించారు. రోడ్డు ఎత్తు, అండర్‌పాస్‌ల సంఖ్య తగ్గించారు. చివరకు దానిమీద సెంట్రల్‌ లైటింగ్‌ సిస్టంను కూడా తొలగించారు. చివరకు దాన్ని ఎక్స్‌ప్రెస్‌ వేగా కాకుండా సాధారణ జాతీయ రహదారిగానే నిర్మించాలని తేల్చారు.

దాదాపు రూ.4 వేల కోట్ల ఖర్చును తగ్గించటంతో ఇక అనుమతి వస్తుందని అంతా భావించారు. కానీ, ఉత్తర ప్రదేశ్‌లోని ఓ కీలక రోడ్డుకు అనుమతి ఇచ్చి కమిటీ చేతులు దులుపుకొంది. ఇంతలో ఆర్థిక సంవత్సరం ముగిసిపోవటంతో బడ్జెట్‌ ఖరారుకు వీలుచిక్కదు. కొత్త ఆర్థిక సంవత్సరంలో, మళ్లీ రోడ్ల ప్రయారిటీ జాబితా రూపొందించాల్సి ఉంది. అందులో ప్రాధాన్య రహదారిగా ట్రిపుల్‌ ఆర్‌ గుర్తింపు దక్కించుకుంటే జూన్‌ నాటికి దానికి అనుమతి వచ్చే అవకాశముంది. కాదంటే, ఏడాది చివరి వరకు ఎదురు చూడాల్సిందేనని తెలుస్తోంది.  

Advertisement
 
Advertisement
Advertisement