ఇస్లామాబాద్: ఇరాన్-అమెరికా మధ్య చర్చలు ముగిశాయి. జేడీ వాన్స్, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మధ్య చర్చలు జరిగాయి. కాల్పుల విరమణను ఎలా ముందుకు తీసుకెళ్లాలనే అంశంపై చర్చలు సాగాయి. సుమారు 14 గంటలపాటు చర్చలు సాగాయి. ఇంకా కొన్ని సాంకేతిక అంశాలు ఖరారు చేయాల్సి ఉందన్న ఇరాన్.. చర్చల్లో ఆర్థిక, సైనిక, న్యాయ, అణు కమిటీలు పాల్గొంటాయని పేర్కొంది. చర్చలు సాధారణ స్థాయి నుంచి నిపుణుల స్థాయికి చేరినట్లు ఇరాన్ ప్రభుత్వం వెల్లడించింది. 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత అమెరికా- ఇరాన్ మధ్య చర్చలు జరగడం ఇదే తొలిసారి.
తొలిదశ చర్చలు ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్‌పై సైనిక విజయం సాధించినట్టు ట్రంప్ చెప్పుకొచ్చారు. ‘‘ఎలా చూసినా గెలుపు అమెరికాదే. చర్చల్లో ఏం జరుగుతుందనేది. మాకు అనవసరం. చర్చలు, ఫలించినా ఫలించకపోయినా హర్మూజ్‌లో మైన్స్ తొలగిస్తాం. హర్మూజ్ విషయంలో మాత్రం వెనక్కి తగ్గేది లేదు’’ అంటూ ట్రంప్ తేల్చి చెప్పారు.
ఎలాంటి ఒప్పందం కుదరకుండానే వెనుదిరుగుతున్నాం: జేడీ వాన్స్
అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు విఫలమయ్యాయి. ఎలాంటి ఒప్పందం కుదరకుండానే వెనుదిరుగుతున్నామని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తెలిపారు. మా డిమాండ్లకు ఇరాన్ అంగీకరించలేదు. ఇరాన్‌తో డీల్ లేదు. 14 గంటల పాటు జరిగిన చర్చలు విఫలమయ్యాయి.. ఇరాన్ వైపు నుంచి సానుకూల నిబద్ధత కనిపించాలి’’ అంటూ జేడీ వాన్స్ వ్యాఖ్యానించారు.
పశ్చిమాసియాలో యుద్ధానికి తెరదించి శాంతిని నెలకొల్పడమే ధ్యేయంగా వైరిపక్షాలైన అమెరికా, ఇరాన్‌ల మధ్య ప్రత్యక్ష చర్చలు శనివారం అధికారికంగా ప్రారంభమయ్యాయి. రెండు వారాల కాల్పుల విరమణ ప్రకటన తర్వాత పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో జరుగుతున్న ఈ మంతనాలకు పాక్ రాజధాని ఇస్లామాబాద్‌లోని ఓ స్టార్ హోటల్ వేదికగా మారింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు శాశ్వత పరిష్కారం కనుగొనే దిశగా చర్చలు జరిగాయి.
ప్రపంచ దేశాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చరిత్రాత్మక చర్చల కోసం ఇస్లామాబాద్‌కు చేరుకున్న అమెరికా, ఇరాన్ ప్రతినిధి బృందాలతో పాక్ ప్రధానమంత్రి షెహబాజ్ శనివారం ఉదయం వేర్వేరుగా సమావేశమయ్యారు. పశ్చిమాసియా పరిస్థితులు, తాజా పరిణామాలపై చర్చించారు. అనంతరం సాయంత్రం అమెరికా, ఇరాన్ మధ్య ప్రత్యక్ష చర్చలు ప్రారంభమయ్యాయి.


