అందుకే ఒప్పందం కుదరలేదు: ఇరాన్‌ కీలక ప్రకటన | Iran Key Statement On Failure of Talks with the US | Sakshi
Sakshi News home page

అందుకే ఒప్పందం కుదరలేదు: ఇరాన్‌ కీలక ప్రకటన

Apr 12 2026 8:43 AM | Updated on Apr 12 2026 10:27 AM

Iran Key Statement On Failure of Talks with the US

ఇస్లామాబాద్‌: అమెరికాతో ఎలాంటి ఒప్పందం కుదరలేదని ఇరాన్‌ వెల్లడించింది. యూఎస్‌ మితిమీరిన డిమాండ్ల వల్లే ఒప్పందం కుదరలేదని.. చర్చల అనంతరం వివాదాస్పద అంశాలు లేవనెత్తారని ఇరాన్‌ పేర్కొంది. హర్మూజ్‌ జలసంధి, అణు హక్కుల వంటి  వివాదస్పద అంశాలు ప్రస్తావించారన్న ఇరాన్‌.. ఏమీ తేలకుండానే అమెరికాతో చర్చలు ముగిశాయని పేర్కొంది.

పాకిస్థాన్‌ రాజధాని ఇస్లామాబాద్‌ వేదికగా అమెరికా- ఇరాన్‌ మధ్య జరిగిన శాంతి చర్చలు విఫలమైన సంగతి తెలిసిందే. 14 గంటలపాటు చర్చలు సాగాయి. ఎలాంటి ఒప్పందం కుదరకుండానే వెనుదిరుగుతున్నామని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ తెలిపారు. తమ డిమాండ్లకు ఇరాన్‌ అంగీకరించలేదు. ఇరాన్‌తో డీల్‌ లేదని ఆయన స్పష్టం చేశారు.

ఇరాన్‌ వైపు నుంచి సానుకూల నిబద్ధత కనిపించాలంటూ జేడీ వాన్స్‌ వ్యాఖ్యానించారు. తాము విధించిన షరతులను ఇరాన్‌ ప్రతినిధులు అంగీకరించలేదని వాన్స్‌ పేర్కొన్నారు. చర్చల్లో తాము చాలా సానుకూలంగా వ్యవహరించామంటూ చెప్పుకున్న వాన్స్‌.. దురదృష్టవశాత్తు ఎలాంటి పురోగతి సాధించలేకపోయామన్నారు.

హార్మూజ్‌ జలసంధిపై సంపూర్ణ ఆధిపత్యం మాకే ఉండాలని.. అక్కడ నియంత్రణను వదులుకొనే ప్రసక్తే లేదంటూ ఇరాన్‌ తేల్చి చెబుతోంది. గల్ఫ్‌ దేశాల నుంచి అమెరికా సైన్యం వెనక్కి వెళ్లిపోవాలి. ఈ ప్రాంతంలో అమెరికా సైనిక స్థావరాలు ఉండడానికి వీల్లేదు. ఇరాన్‌పై అమెరికాతోపాటు యూరప్‌ దేశాలు విధించిన ఆంక్షలను ఎత్తివేయాలి. యురేనియం శుద్ధి సహా అణు కార్యక్రమాలపై ఎలాంటి ఆంక్షలు విధించకూడదు. స్తంభింపజేసిన మా ఆస్తులను విడుదల చేయాలి’’ అని ఇరాన్‌ డిమాండ్‌ చేస్తూ వస్తోంది.

మరోవైపు, ఇరాన్‌ అణ్వాయుధాలు కలిగి ఉండడానికి ఎంతమాత్రం వీల్లేదని అమెరికా డిమాండ్‌ చేస్తోంది. యురేనియం శుద్ధి ప్రక్రియను ఇరాన్‌ వెంటనే ఆపాలి. ఇప్పటికే శుద్ధి చేసిన యురేనియం నిల్వలను మాకు అప్పగించాలి. హార్మూజ్‌ నుంచి స్వేచ్ఛాయుత నౌకాయానానికి వీలు కల్పించాలి. విదేశీ నౌకల రాకపోకలను అడ్డుకోరాదు’’ అని అమెరికా స్పష్టం చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement