చంద్రునిపైకి మనోడు: ‘ఆర్టెమిస్’ సారథిగా అమిత్ క్షత్రియ | Amit Kshatriya a key man in NASA's Moon Mission | Sakshi
Sakshi News home page

చంద్రునిపైకి మనోడు: ‘ఆర్టెమిస్’ సారథిగా అమిత్ క్షత్రియ

Apr 12 2026 11:42 AM | Updated on Apr 12 2026 12:50 PM

Amit Kshatriya a key man in NASA's Moon Mission

న్యూఢిల్లీ: ఒకప్పుడు హ్యూస్టన్‌(అమెరికా)లో ఆకాశంలోకి దూసుకెళ్లే రాకెట్లను చూసి ఆశ్చర్యపోయిన ఒక భారతీయ సంతతి కుర్రాడు ఇప్పుడు ఏకంగా అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు సారధ్యం వహిస్తున్నాడు. మానవుడిని మళ్లీ చంద్రుడిపైకి పంపేందుకు నాసా చేపడుతున్న ఆర్టెమిస్ మిషన్‌ను అమిత్ క్షత్రియ అనే ప్రవాస భారతీయుడు పర్యవేక్షిస్తున్నాడు. ఆయన నాసా అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్‌గా, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా కీలక బాధ్యతలు నిర్వహిస్తూ, మన దేశ ఖ్యాతిని ఖండాంతరాలు దాటిస్తున్నారు.

అమిత్ తల్లిదండ్రులు ఇండియా నుంచి అమెరికాకు వలస వెళ్లారు. విస్కాన్సిన్ లోని బ్రూక్ ఫీల్డ్ లో జన్మించిన అమిత్.. నాసా జాన్సన్ స్పేస్ సెంటర్ ఉన్న టెక్సాస్ లోని హ్యూస్టన్ నగరంలో పెరిగాడు. కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మ్యాథ్మెటిక్స్ లో బ్యాచిలర్స్ డిగ్రీ, యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ నుంచి మాస్టర్స్ పూర్తి చేశారు. పెట్రోలియం, మెడికల్ రంగాల్లో పనిచేసిన ఆయన 2008లో యునైటెడ్ స్పేస్ అలయన్స్ ద్వారా నాసా ప్రయాణాన్ని ప్రారంభించాడు.

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో పని చేసిన విశేష అనుభవంతో పాటు, ఆర్టెమిస్-1 మిషన్ లో కూడా అమిత్ కీలక పాత్ర పోషించారు. గత ఏడాది సెప్టెంబర్ లో నాసా అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్ గా నియమితులయ్యారు. 1972 నాటి ‘అపోలో 17’ తర్వాత, 2028 నాటికి మనిషిని చంద్రుడిపైకి పంపాలని నాసా లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవల ‘ఆర్టెమిస్ 2’ మిషన్ విజయవంతంగా తిరిగి వచ్చిన తర్వాత అమిత్ మాట్లాడుతూ చంద్రుడిపైకి వెళ్లే మార్గం సుగమమైంది. కానీ మనం చేయాల్సిన పని ఇంకా చాలా ఉంది అని అన్నారు. సురక్షితమైన అంతరిక్ష ప్రయాణాలకు ఆయన చేసిన కృషికి గాను నాసా అవుట్ స్టాండింగ్ లీడర్ షిప్ మెడల్‌తో పాటు, వ్యోమగాములు బహూకరించే ప్రతిష్టాత్మక సిల్వర్ స్నూపీ అవార్డును కూడా అమిత్ దక్కించుకున్నారు.

ఇది కూడా చదవండి: ఇంటర్నెట్‌ను ఊపేసిన ‘90-డిగ్రీల’ బ్రిడ్జి ఇక హిస్టరీ!

Advertisement
 
Advertisement
Advertisement