జెరూసలేం: ఇరాన్‌తో యుద్ధంపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌పై చేపట్టిన సైనిక చర్యలు ఇంకా పూర్తికాలేదని బాంబు పేల్చారు. కాగా, ఇరాన్‌పై ఇప్పటికే విజయం సాధించినట్టు నెతన్యాహు చెప్పుకొచ్చారు. మరోవైపు లెబనాన్‌తో శాశ్వత శాంతి కోసం ఇజ్రాయెల్ సిద్ధంగా ఉందని వెల్లడించారు.
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా నెతన్యాహు మాట్లాడుతూ..‘ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించే నాటికి ఇరాన్ అణ్వస్త్రాలకు అత్యంత సమీపంలో ఉంది. రోజుకు వందల క్షిపణులు తయారు చేసే సామర్థ్యం పెంచుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఈ రెండు అస్తిత్వ ముప్పులను ఎదుర్కోవడమే మా లక్ష్యమని అన్నారు. అలాగే, ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీని భూగర్భంలో అణు, క్షిపణి కార్యక్రమాలను దాచిపెట్టాలని ప్రయత్నించారని ఆరోపించారు. అలాంటి స్థితిలో ఇజ్రాయెల్ చూస్తూ ఊరుకోలేకపోయిందని చెప్పారు. ఈ ప్రాంతంలో అస్థిరతకు కారణం ఇరాన్ విధానాలేనని ఆరోపించారు.
ఇరాన్ బలహీనమే..
ఇరాన్ వద్ద ఉన్న 400 కిలోల సమృద్ధ యురేనియం విషయంలో కూడా నెతన్యాహు స్పందించారు. దానిని దౌత్యపరంగా లేదా అవసరమైతే బలప్రయోగంతో తొలగిస్తామని హెచ్చరించారు. పశ్చిమాసియా మ్యాప్ చూపిస్తూ వాళ్లు మమ్మల్ని అణగదొక్కాలని చూశారని, ఇప్పుడు తామే వారిని బలహీనపరుస్తున్నామని చెప్పారు. ఇజ్రాయెల్ చర్యల వల్ల ఇరాన్ బలహీనపడిందని, కాల్పుల విరమణ కోరుతున్నదని నెతన్యాహు అన్నారు. దేశంలో అంతర్గత సమస్యలు పెరిగాయని కూడా పేర్కొన్నారు. మమ్మల్ని నాశనం చేస్తామని బెదిరించినవాళ్లు ఇప్పుడు తమకే బతుకుబండిపై పోరాడుతున్నారని వ్యాఖ్యానించారు.
శాంతి కోసం సిద్ధం..
లెబనాన్‌తో శాశ్వత శాంతి కోసం సిద్ధమని, అయితే ఈ ఒప్పందం తరాల పాటు నిలిచేలా ఉండాలని నెతన్యాహు స్పష్టం చేశారు. అదే సమయంలో ఇజ్రాయెల్ తన భద్రతకు హాని కలిగించే శక్తులపై చర్యలు కొనసాగిస్తుందని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. లెబనాన్ గత నెలలో పలుమార్లు శాంతి చర్చలకు ముందుకొచ్చిందని చెప్పారు. కాగా, లెబనాన్‌తో వచ్చే వారం నుంచే అధికారిక చర్చలు ప్రారంభించేందుకు ఇజ్రాయెల్ అంగీకరించింది. శాంతి ఒప్పందానికి ఇజ్రాయెల్ రెండు ప్రధాన షరతులు విధించింది. మొదటిగా, సైనిక సామర్థ్యాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయాలి. రెండోది, భద్రతకు హామీ ఇచ్చేలా దీర్ఘకాలిక శాంతి ఒప్పందం ఉండాలి.


