● రోజురోజుకూ పడిపోతున్న ధాన్యం ధర
● కలవరపెడుతున్న వాతావరణం
● ఆందోళనలో రైతులు
నరసన్నపేట: రబీలో ధాన్యం విక్రయాలకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం నుంచి కనీస మద్దతు లేకపోవడంతో ధాన్యం అమ్మకాలకు దళారులపైనే ఆధారపడుతున్నారు. చేసేది లేక వారు ఎంత రేటు చెపితే ఆ ధరకే విక్రయాలు చేస్తున్నారు. నరసన్నపేట నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో పెద్ద ఎత్తున రైతులు రబీలో వరి సాగు చేశారు. వాతావరణం అనుకూలించడంతో మంచి దిగుబడులు వస్తున్నాయి. అయితే ధర ఆశించిన లేకపోవడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. సుగర్ లెస్ సాంబా(ఆర్‌ఎన్‌ఆర్), 1010 వంటి రకాలను రైతులు వేశారు. ప్రస్తుతం నరసన్నపేట, సారవకోట మండలాల్లో ముమ్మరంగా వరి కోతలు జరుగుతున్నాయి. మిషన్లు పొలాల్లో కలియ తిరుగుతున్నాయి. అయితే ధర ఆశించినంత లేకపోవడం రైతులను కలవర పరుస్తోంది. 10 రోజుల క్రితం సుగర్ లెస్ ధాన్యం 80 కేజీల బస్తాను రూ.2150కు కొనుగోలు చేశారు. ప్రస్తుతం రూ.1910 లకు కొనుగోలు చేస్తున్నారు. ఇంకా ధరలు తగ్గుతాయని, యుద్ధ ప్రభావం ధాన్యం ధరలపై ఉందని దళారులు రైతులను హెచ్చరిస్తున్నారు. మరోవైపు వాతావరణం మారుతుండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
ఇదీ పరిస్థితి..
నరసన్నపేట మండలంలో చెన్నాపురం, తోటాడ, నడగాం, గునబుపేట, ఉర్లాంలతో పాటు అనేక గ్రామాల్లో వరి పంట కోత దశలో ఉంది. ఆయా గ్రామాల్లో కోతలు ప్రారంభమైతే ధాన్యం మరింతగా మార్కెట్‌కు వస్తుంది. అప్పుడు ధరలు మరింతగా తగ్గుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో 8764 ఎకరాల్లో వరి పంట వేశారు. సరాసరి ఎకరాకు 27 నుంచి 34 బస్తాల వరకూ దిగుబడి వస్తుంది. ధర బాగుంటే కలిసి వచ్చేదని, ఇప్పుడు దళారులు ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఉంటే రైతులకు దన్నుగా ఉండేదని అంటున్నారు. ఎంతో ఆశతో సన్నరకాలు పండిస్తున్నామని, అయినా ధర నిరాశ పరుస్తుందని వాపోతున్నారు. మార్కెట్‌లో సన్న బియ్యం ధరలు చూస్తే ఆకాశానికి అంటుతున్నాయి. వంద కేజీలు రూ.6500 లకు విక్రయాలు చేస్తున్నారు. ఈ దశలో ధాన్యానికి ధర ఉండక పోవడానికి కారణం దళారుల మాయాజాలమేనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం ధాన్యం 80 కేజీలు రూ.1920 కొనుగోలు చేస్తున్నారు. ఈ ధర నిలిస్తే కొంత అనుకూలంగా ఉంటుంది. తగ్గితే తీవ్ర నిరాశ కలుగుతుంది. మరో వారం కల్లా 80 కేజీలు ధర రూ.1800 అవుతుందని దళారులు అంటున్నారు. ధాన్యం ధర తగ్గకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
– డోల ఈశ్వరరావు, రైతు, జగన్నాథపురం
రబీ ధాన్యం అమ్మకాలు, కొనుగోళ్లు విషయంలో అంతా దళారులతే హవా. వారు చెప్పిన ధరే ఫైనల్. దీంతో దళారులు ఇష్టానుసారంగా ధరలు నిర్ణయిస్తున్నారు. రైతులకు ప్రభుత్వం నుంచి మద్దతు లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో దళారులను ఆశ్రయించక తప్పడం లేదు.
– నేతింటి రాజేశ్వరరావు, రైతు, భవానీపురం


