టెక్కలి: వైఎస్సార్‌సీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్‌చార్జి పేరాడ తిలక్‌కు టెక్కలి పోలీసులు శుక్రవారం రాత్రి నోటీసులు అందజేశారు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణంపై మంత్రి అచ్చెన్నాయుడు చేసిన అనుచిత వ్యాఖ్యలపై గురువారం టెక్కలిలో తిలక్ నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎస్‌ఐ రఘునాథరావు, సిబ్బంది టెక్కలిలోని వైఎస్సార్ సీపీ కార్యాలయానికి వెళ్లి తిలక్‌కు నోటీసులు అందజేశారు. టెక్కలి పోలీస్ స్టేషన్‌కు హాజరై సంజాయిషీ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు.
పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం
శ్రీకాకుళం అర్బన్: తల్లి, పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోవాలని ఐసీడీఎస్ జిల్లా ప్రాజెక్టు అధికారి కె.రూపలత అన్నారు. జిల్లా కేంద్రంలోని గుజరాతిపేటలో అర్బన్ ప్రాజెక్ట్ పరిధిలో శుక్రవారం 8వ పోషణ పక్వాడపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన 8 మంది అంగన్‌వాడీ కార్యకర్తలకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో మిషన్ శక్తి వాస్తల్య కో–ఆర్డినేటర్ డి.ఉమ, సీడీపీఓ పి.నాగరాణి, పర్యవేక్షకులు పి.సీతామహాలక్ష్మి, యశోద, బి.యోగేశ్వరి, బీపీసీ గజలక్ష్మి, యూడీసీ హరికృష్ణ, అంగన్‌వాడీ కార్యకర్తలు ఆదిలక్ష్మి, సంధ్యారాణి, దమయంతి, అరుణ కుమారి, జ్యోతిలక్ష్మి, ఇందిరా, రాజేశ్వరి పాల్గొన్నారు.
గిరిజన మహిళ కుటుంబాన్ని ఆదుకోండి
కొత్తూరు: అడ్డంగి పంచాయతీ దిగువ మల్లెలుగూడకు చెందిన గిరిజన మహిళ సవర చిన్నారి ఏడాది కిందట పిడుగుపాటుకు గురై మృతిచెందిందని, ఇంతవరకు ఆమె తల్లిదండ్రులకు ఆర్థిక సాయం అందించకపోవడం దారుణమని ఏపీ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి నిమ్మక అప్పన్న అన్నారు. శుక్రవారం గ్రామస్తులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులకు ఆర్థిక సాయం అందిస్తామని కూటమి నేతలు, అధికారులు హామీ ఇచ్చి ఏడాది గడిచినా ఒక్క రూపాయి కూడా అందజేయకపోవడం దారుణమన్నారు. ఇప్పటికై నా పాలకులు స్పందించి రూ. 15 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు.


