● కార్మికుడు మృతి
ఎచ్చెర్ల : కుశాలపురం ప్రాంతంలోని పారిశ్రామికవాడలో ఓషియానిక్ శాండ్ ప్రైవేటు లిమిటెడ్ పరిశ్రమలో శుక్రవారం ఉదయం జరిగిన ప్రమాదంలో మొదలవలస సంతోష్‌కుమార్ (36) అనే కార్మికుడు మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, ఎచ్చెర్ల పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుశాలపురంలో నివాసముంటున్న సంతోష్‌కుమార్ ఈ నెల 9న రాత్రి షిఫ్టుకు హాజరయ్యాడు. విధులు నిర్వహిస్తుండగా శుక్రవారం వేకువజామున పరిశ్రమలోని ఫోర్కు లిఫ్ట్ బలంగా ఢీకొట్టింది. ఛాతి, తలకు గాయాలు కావడంతో తోటి కార్మికులు శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సంతోష్‌కుమార్‌కు భార్య కవిత, కుమారుడు శ్రావణ్‌కుమార్ ఉన్నారు. సంతోష్ మామయ్య హరిప్రసాద్ ఫిర్యాదుమేరకు ఎచ్చెర్ల ఎస్సై జి.లక్ష్మణరావు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.


