● కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
శ్రీకాకుళం పాతబస్టాండ్: దివ్యాంగులకు అన్నివిధాలుగా అండగా ఉంటామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. దివ్యాంగ శక్తి పథకం ప్రారంభం సందర్భంగా కలెక్టరేట్‌లో దివ్యాంగ ఉద్యోగులు, ఇతర దివ్యాంగులకు బుధవారం భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన దివ్యాంగులతో మాట్లాడి అర్హతలు తెలుసుకున్నారు. వారి అర్హతకు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధి అధికారిని పిలిచి వారు చేయగలిగే ఉద్యోగం ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్‌కు వెళ్లి అందరూ పరిశీలన చేసి, ఏం అవసరమో తెలియజేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి లక్ష్మణమూర్తి, కలెక్టరేట్ పరిపాలనాధికారి జీఏ సూర్యనారాయణ, తహసీల్దార్ గణపతిరావు, డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాసరావు, ఆర్‌ఐ లింగరాజు తదితరులు పాల్గొన్నారు.


