● ఎమ్మెల్సీ
నర్తు రామారావు
ఇచ్ఛాపురం రూరల్: రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని ఎమ్మెల్సీ నర్తు రామారావు మండిపడ్డారు. స్థానిక విలేకరులతో బుధవారం ఆయన మాట్లాడారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు చేసిన వికృత చేష్టలు ప్రజలను కలచివేశాయని, ఇలాంటి ఘటనలు ప్రభుత్వ పరువు తీసేలా ఉన్నాయని అన్నారు. ఇదే సమయంలో డ్రగ్స్ కేసులో పట్టుబడిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ వంటి వ్యక్తులు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండటం కూటమి ప్రభుత్వం నైతిక విలువలపై ప్రశ్నలు లేవనెత్తుతోందని దుమ్మెత్తిపోశారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, కూటమి ఎమ్మెల్యేలు అఘాయిత్యాలకు పాల్పడినా వారిపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమని మండిపడ్డారు. రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో అరాచకాలు రోజురోజుకూ పెరుగుతున్నాయని ఆరోపించారు. ప్రజలకు మంచి పాలన అందిస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు వివాదాలు, అవినీతి, అక్రమాలకు కేంద్రంగా మారిందని తీవ్ర విమర్శలు గుప్పించారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిని, ఎంపీ పుట్టా మహేష్‌కుమార్ యాదవ్‌ను వెంటనే పదవుల నుంచి తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


