● ముగిసిన ఇంటర్మీడియట్ రెగ్యులర్ కోర్సుల పరీక్షలు
● ఇళ్లబాట పట్టిన విద్యార్థులు
● ఈనెల 21 నుంచి వాల్యూయేషన్
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ముగిశాయి. ఇక మూల్యాంకనమే మిగిలి ఉంది. ఈనెల 17వ తేదీతో ఇంటర్ ప్రథమ సంవత్సరం రెగ్యులర్ కోర్సుల పరీక్షలు ముగియగా.. బుధవారంతో ద్వితీయ సంవత్సరం (సీనియర్ ఇంటర్) రెగ్యులర్ కోర్సుల పరీక్షలు ముగిశాయి. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. వాస్తవానికి జిల్లాలో 71 పరీక్ష కేంద్రాల్లో ఫిబ్రవరి 23వ తేదీన మొదలైన ఈ పరీక్షలు ప్రభుత్వ సెలవులు మినహా.. మిగిలిన అన్ని రోజుల్లో 20 రోజులపాటు పరీక్షలు నిర్విరామంగా జరిగాయి. అయితే జిల్లాలో అతి తక్కువ కేంద్రాల్లో కేవలం పదుల సంఖ్యలో మాత్రమే విద్యార్ధులు రాసే పలు బ్రిడ్జ్ కోర్సుల పేపర్లకు మార్చి 24వ వరకు పరీక్షలు జరగనున్నాయి.
259 మంది గైర్హాజరు
ఇదిలా ఉండగా పరీక్షల్లో భాగంగా బుధవారం సెట్–2 ప్రశ్నాపత్రంతో ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు కెమిస్ట్రీ పరీక్ష రాశారు. జిల్లావ్యాప్తంగా 71 కేంద్రాల్లో జరిగిన పరీక్షకు జనరల్ విభాగంలో 15,624 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా.. 15,365 మంది పరీక్ష రాశారు. వివిధ కారణాలతో 259 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. వివిధ ప్రభుత్వ, ప్రైవేటు హాస్టల్స్, వసతి కేంద్రాల్లో ఉంటున్న విద్యార్థులు ఇంటిబాట పట్టారు. దీంతో శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రయాణికులతో కిటకిటలాడింది.
మాల్ ప్రాక్టీసు కేసులు నిల్
ఈ ఏడాది ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో ఎలాంటి మాల్ ప్రాక్టీసులు నమోదుల(డీబార్లు) కాకపోవడం విశేషం. శ్రీకాకుళం జిల్లా చరిత్రలో ఒక్క మాల్ ప్రాక్టీసు కేసు కూడా నమోదు కాకపోడం ఇదే తొలిసారి. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలో 2023లో సీసీ కెమెరాలతో ఆన్‌లైన్ స్ట్రీమింగ్ విధానాన్ని తీసుకొచ్చారు. ఈ విధానంతో పరీక్ష కేంద్రాలపై అధికారులు పక్కా నిఘా ఉంచారు. నిరంతరం పర్యవేక్షించారు. ఆర్‌ఐఓ రేగ సురేష్‌కుమార్ నేతృత్వంలో డీఈసీ కమిటీ సభ్యులు బి.శ్యామ్‌సుందర్, ఎస్.భీమేశ్వరరావు, ఎస్.అన్నపూర్ణారావుతోపాటు సిట్టింగ్ స్క్వాడ్, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఆకస్మిక తనిఖీలు జరిపినప్పటికీ ఎలాంటి మాల్ ప్రాక్టీసులు నమోదు కాలేదు.
మూల్యాంకనకు ఏర్పాట్లు
కాగా ఈనెల 21వ తేదీ నుంచి శ్రీకాకుళం ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల కేంద్రంగా ఇంటర్మీడియట్ జవాబు పత్రాల దిద్దుబాటు ప్రక్రియ మొదలుకానుంది. వివిధ విడతలుగా జరగనున్న ఈ స్పాట్ వాల్యూయేషన్ ప్రక్రియకుగాను అధికారులు అన్ని ఏర్పాట్లు పక్కాగా చేస్తున్నారు. ప్రధాన ద్వారంతోపాటు దిద్దుబాటు జరిగే అన్ని గదుల్లోనూ సీసీ కెమెరాలను అమర్చడంతోపాటు ఆన్‌లైన్ స్ట్రీమింగ్ చేస్తున్నారు. వాల్యూయేషన్‌లో పాల్గొనే అధికారులు, ఎగ్జామినర్లు, సిబ్బంది నియామకం ఉత్తర్వులను ఆయా కాలేజీల లాగిన్లలో ఇంటర్మీడియట్ బోర్డు పొందుపర్చింది.


