శ్రీకాకుళం: శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్న సంపత్ రావు శశిభూషణ్ గతంలో సమగ్ర శిక్ష అభియాన్‌లో ఏపీసీగా పనిచేసినప్పుడు కోర్టు ఉత్తర్వులను అమలు చేయని కారణంగా ఆయన్ని సస్పెండ్ చేయాలని ఆదేశించడంతో దాన్ని అమలు చేస్తూ ఉన్నత విద్యాశాఖ కమిషనర్ రెండు రోజుల కిందట ఉత్తర్వులు జారీ చేశారు. శశి భూషణ్ రావు కంటే ముందు ఏపీసీగా పనిచేసిన జయ ప్రకాష్ జిల్లాలో కేజీబీవీలో సీఆర్పీలుగా పనిచేస్తున్న కొందరిని తొలగించారు. దీనిపై ఆయా సీఆర్టీలు హైకోర్టును ఆశ్రయించారు. ఇది జరిగిన సందర్భంలో జయప్రకాష్‌కు బదిలీ అవ్వగా శశిభూషన్ ఏపీసీగా బాధ్యతలు స్వీకరించారు. తొలగించిన సీఆర్టీలను విధుల్లోకి తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. దీన్ని శశిభూషణ్ రావు అమలు చేయకుండా ఉండిపోయారు. దీంతో బాధిత సీఆర్పీలు కోర్టు తీర్పును అమలు చేయలేదని మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఆగ్రహం చెందిన హైకోర్టు న్యాయమూర్తి సమగ్ర శిక్ష రాష్ట్ర అధికారిని వివరణ కోరారు. దీనిపై ఎస్పీడీగా తాను తిరిగి విధుల్లోకి చేర్చుకోవాలని ఉత్తర్వులు జారీ చేశానని, జిల్లా స్థాయిలో దాన్ని అమలు చేయలేదని వివరణ ఇచ్చారు. ఈ కారణంగా అప్పటి ఏపీసీ శశిభూషణ్ రావును సస్పెండ్ చేయాలని కోర్టు ఆదేశించడంతో సమగ్ర శిక్ష అధికారులు ప్రస్తుతం శశిభూషణ్ పనిచేస్తున్న ఉన్నత విద్యాశాఖ అధికారులకు విషయాన్ని పొందుపరిచారు. వీటిని పరిశీలించిన ఉన్నత విద్యాశాఖ అధికారులు సస్పెండ్ చేస్తూ రెండు రోజుల కిందట ఉత్తర్వులు వెలువరించారు. అయితే దీన్ని కళాశాల ప్రిన్సిపాల్ పోలి నాయుడు అమలు చేయకుండా తాత్సారం చేశారు. దీనిపై ఎవరు అడిగినా ఉత్తర్వులను నిలుపుదల చేయాలని ఉన్నత విద్యాశాఖ కమిషనర్ నుంచి మౌఖిక ఆదేశాలు వచ్చాయని, ఈ కారణంగానే అమలు చేయలేదని చెబుతూ, సస్పెన్షన్ ఉత్తర్వులను వాట్సాప్‌లో పంపించడం వల్ల, దాన్ని డిలీట్ చేసేశానని చెబుతూ వచ్చారు. అయితే బుధవారం సాయంత్రం సరికి సస్పెన్షన్ ఉత్తర్వులు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేశాయి. దీనిని అమలు చేయకపోవడంపై దళిత సంఘాలు మండిపడుతూ గురువారం ఆందోళన చేపట్టాలని నిశ్చయించాయి. హైకోర్టు ఆదేశాలను తక్షణమే అమలు చేసి సంబంధిత అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని దళిత ఆదివాసీ ప్రజా సంఘాల జేఏసీ జిల్లా కన్వీనర్ దుర్గాసి గణేష్ , కులనిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మిస్కా కృష్ణయ్య డిమాండ్ చేశారు.


