బ్యాంకు ఉద్యోగిని ఆత్మహత్య

- - Sakshi

శ్రీకాకుళం క్రైమ్‌: గరంలోని పీఎన్‌కాలనీలో నివాసముంటున్న ఓ బ్యాంకు ఉద్యోగిని ఎలుకల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. శ్రీకాకుళం రెండో పట్టణ ఎస్‌ఐ కె.లక్ష్మి తెలిపిన వివరాల మేరకు.. పీఎన్‌కాలనీ మొదటి లైన్‌ సాయిసత్య అపార్ట్‌మెంట్‌లో ఉరిటి స్వప్నప్రియ(39) తల్లి సరళ, సోదరుడు కిరణ్‌బాబులతో కలిసి నివాసముంటోంది. స్వప్నప్రియ గార మండలం స్టేట్‌బ్యాంకు ఆఫ్‌ ఇండియా బ్రాంచి ఆఫీసులో డిప్యూటీ మేనేజరు/అకౌంటెంట్‌గా , కిరణ్‌బాబు శ్రీకాకుళం ఎస్బీఐ రీజియన్‌లో పనిచేస్తున్నారు. వీరి స్వగ్రామం నరసన్నపేట సమీపంలోని యారబాడు. స్వప్నప్రియకు 2010లో శ్రీకాకుళానికి చెందిన కుప్పలి ప్రదీప్‌కుమార్‌తో వివాహం జరిగినా అభిప్రాయ భేదాలు రావడంతో 2019లో ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి తాను ఒంటరిననే బాధతో ఉండేవారు.

తనఖా బంగారం మాయమవ్వడంతో..
గార ఎస్‌బీఐలో ఖాతాదారులు తనఖా పెట్టిన రూ.3 కోట్ల బంగారం మాయమైందని, దీని వెనుక డిప్యూటీ మేనేజర్‌/అకౌంటెంట్‌గా ఉన్న ఓ మహిళా ఉద్యోగినితో పాటు కొందరి హస్తముందని కొన్ని పత్రికల్లో(సాక్షి కాదు) వరుస కథనాలు వస్తున్నాయి. ఖాతాదారులు బ్యాంకు వద్ద ఆందోళనకు దిగడం, చివరకు బుధవారం గార సీఐ కామేశ్వరరావు సమక్షంలో రీజనల్‌ మేనేజర్‌ ఖాతాదారులకు బంగారం ఇప్పించే బాధ్యత తనదని సర్దిచెప్పి వెళ్లిపోయారు.

ఆ కథనాలతో మనస్థాపం చెంది..
పత్రికల్లో వస్తున్న కథనాలు తన గురించే అని ఇంటి వద్ద తల్లితో చెప్పి స్వప్నప్రియ తీవ్రంగా మనోవేదన చెందేదని, సోషల్‌ మీడియాలో కూడా కావాలనే తనపై తప్పుడుగా ప్రచారం చేస్తున్నారని స్వప్నప్రియ వాపోయేది. ఈ క్రమంలో ఈ నెల 24న బయటకు వెళ్లి వచ్చిన స్వప్నప్రియ వాంతులు చేయడంతో తల్లి ఆందోళన చెందింది. ఏమైందని అడగ్గా.. తన బతుకు ఇలా అయిపోయిందని ఏడుస్తూ పడుకుంది. మరుసటి రోజు నగరంలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకుని ఇంటికి వచ్చి ఎలుకల మందు తాగానని తల్లితో చెప్పింది.

అప్పటి నుంచి మందులు వాడుతున్నా వాంతులు తగ్గలేదు. ఈక్రమంలో ఆరోగ్యం రోజురోజుకీ క్షీణిస్తుండటంతో నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. మెరుగైన చికిత్స కోసం విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా బుధవారం ఉదయం మృతిచెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. అంత్యక్రియల కోసం మృతదేహాన్ని స్వప్నప్రియ స్వగ్రామం యారబాడుకు తరలించనున్నట్లు ఎస్‌ఐ లక్ష్మి చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

Read latest Srikakulam News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top