పసిప్రాణానికి పరీక్ష
నాన్న మెడపై రెండు చేతులు వేసి మురిసిపోయే అబ్బాయి ఇకపై ఆ పని చేయలేడు. అమ్మ చేతిని తన చిన్ని చేతులతో తడిమి తడిమి ముద్దు చేసే పిల్లాడికి దేవుడు ఒక చేతిని దూరం చేశాడు. నానమ్మ గోరుముద్దలు తినిపిస్తున్న వేళ అనుకోకుండా జరిగిన విద్యుదాఘాతం మూడేళ్ల బాలుడి జీవితాన్ని మార్చేసింది. ఒంటి నిండా గాయాలతో, కంటి నిండా నీటితో ఆస్పత్రి మంచంపై పడి ఉన్న కుమారుడిని చూసి అమ్మానాన్నలకు శోకం ఆగడం లేదు. ఇప్పటికే ఒక చేతిని కోల్పోయిన పిల్లాడికి చికిత్స చేయించడానికి వారి స్థోమత సరిపోవడం లేదు. పిల్లాడి దుస్థితి తలచుకుని, తమ ఆర్థిక స్థితి తెలుసుకుని ఆ దంపతులు నరకయాతన పడుతున్నారు. దాతలపైనే భారం వేశారు.
శ్రీకాకుళం రూరల్ : తన మూడేళ్ల మనవడిని మేడ మీదకు తీసుకెళ్లి తినిపిద్దామని చూసిన నానమ్మకు దేవుడు పరీక్ష పెట్టాడు. పిల్లాడికి తినిపిస్తుండగా విద్యుత్ షాక్ తలగడంతో ఇద్ద రూ తీవ్రంగా గాయపడ్డారు. వజ్రపుకొత్తూరు మండలం కొండవూరులో ఈనెల 4న ఘటన చోటుచేసుకోగా తీవ్ర గాయాలపాలైన నాయనమ్మ అడ్డి తులసమ్మ, మనవడు మూడేళ్ల అడ్డి భువన్‌లు ప్రస్తుతం రాగోలు జెమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. బాబు కుడిచేయి పూర్తిగా కాలిపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో తీసేయాల్సి వచ్చింది. తులసమ్మకు కూడా శరీరం మొత్తం ఇన్‌ఫెక్షన్ అయ్యింది. పిల్లాడి తండ్రి సింహాచలం, తాత మల్లేషు దినసరి కూలీలు. రెక్కాడితే గానీ డొక్కాడదు. ఇలాంటి పరిస్థితుల్లో బాబు వైద్య చికిత్స కోసం వారు అల్లాడుతున్నారు.
ఈ దంపతులకు భువన్ కంటే ముందు ఒక బాబు జన్మించి చనిపోయాడు. భువన్ పుట్టాక గానీ వారికి ఆ బాధ తీరలేదు. మూడేళ్ల వయసున్న కుమారుడికి ఇప్పుడు ఈ దుస్థితి రావడంతో ఏం చేయాలో తెలీక వారు కుమిలిపోతున్నారు. గ్రామంలోని యువత, యువ జన సంఘాలు వారికి తోచినంత ఆర్థికసాయం అందిస్తున్నారు. చిన్నారికి పూర్తిస్థాయిలో చికిత్స అందించాలంటే ఇంకా సాయం అవసరమవుతుంది. దీంతో ఆ తల్లిదండ్రులు దాతల సాయం కోసం అర్థిస్తున్నారు. ఆ సాయమే తమ బిడ్డ బతుకులో వెలుగు నింపుతుందని కోరుతున్నారు. సాయం చేయదలచుకున్న వారు 95054 01583 నంబర్‌ను సంప్రదించాలని కోరుతున్నారు.
విద్యుదాఘాతంలో తీవ్రంగా గాయపడిన మూడేళ్ల చిన్నారి
ఒక చేతిని కోల్పోయిన బాలుడు
నానమ్మ తినిపిస్తుండగా విద్యుత్‌షాక్
చికిత్స కోసం అవస్థ పడుతున్న
తల్లిదండ్రులు
దాతల సాయం కోసం ఎదురుచూపు
పసిప్రాణానికి పరీక్ష


