● హిందూపురంలోని సర్వే నంబరు 66/1ఏ/1లో 18.40 ఎకరాలుండగా.. భూపాలం శ్రీకాంత్, పురిడి దేవరాజు అనే వ్యక్తులకు 1937 నుంచి వంశపారంపర్యంగా వస్తోంది. అందులోని 5.90 ఎకరాలకు (రూ.50 కోట్ల విలువ) బాలకృష్ణ పీఏల్లోని ఒకరు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి కాజేసేయత్నం చేశాడు. దీంతో ఈనెల 14వ తేదీన బాధితులు ఆందోళనకు దిగారు.
● లేపాక్షిలో పార్కింగ్ కోసం టెండర్లు పిలవగా రూ.60 లక్షలపైచిలుకు టెండరు దాఖలైంది. అయితే బాలకృష్ణ పీఏల్లో ఒకరి సూచన మేరకు ఆ టెండరును రద్దు చేసిన అధికారులు...ఆ తర్వాత కేవలం రూ.25 లక్షలకు కుదించి మిగిలిన మొత్తాన్ని స్వాహా చేశారనే ఆరోపణలున్నాయి. లేపాక్షి ఆలయ కమిటీ చైర్మన్ పదవి కోసం కూడా భారీగా ముడుపులు స్వీకరించినట్లు సమాచారం.
● హిందూపురం శివారున అనధికారికంగా బెల్టు షాపు నిర్వహిస్తున్నారు. బాలకృష్ణ పీఏలతో ఒకరి అండతోనే బెల్టు షాపు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. అందుకే అధికారులు అటు వైపు కన్నెత్తి చూడలేని పరిస్థితి. అన్ని శాఖల అధికారులు ఈ అనుచరుడి కనుసన్నల్లోనే విధులు నిర్వర్తిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు.
● నియోజకవర్గంలో బియ్యం దందా, ఇసుక దోపిడీ, మట్టి మాఫియా, డంపింగ్ యార్డు, పేకాట, ప్రైవేటు వ్యాపారుల నుంచి నెల మామూళ్లు.. తదితర వ్యవహారాలన్నీ బాలయ్య పీఏల్లో ఇంకొకరు చూస్తుంటారు. దీంతో పాటు ప్రతిపక్ష పార్టీలపై ఎవరితో కేసులు పెట్టించాలి, ఎవరిపై దాడి చేయాలనే స్కెచ్ కూడా అతనే వేస్తారని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు
...ఇలా బాలకృష్ణ నలుగురు పీఏలు నియోజకవర్గాన్ని నలువైపులా ఆక్రమించి అక్రమాలు, ఆక్రమణలు చేస్తున్నారు. వీరి పోరు పడలేని స్థానికులు తమ గోడు చెప్పుకుందామంటే ఎమ్మెల్యే బాలకృష్ణ హైదాబాద్‌లో ఉంటారు. నియోజకవర్గానికి వచ్చినప్పుడైనా చెప్పుకుందామంటే ఆయన చెంపదెబ్బతో సమాధానం ఇస్తారు. అందుకే హిందూపురం వాసులు ఆయన్ను ఎందుకు గెలిపించుకున్నామా...అని ఇప్పుడు బాధపడుతున్నారు.
సాక్షి, పుట్టపర్తి
హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సినిమా షూటింగ్‌లలో బిజీగా ఉంటూ.. నియోజకవర్గానికి చుట్టపుచూపుగా వచ్చి వెళ్తుంటారు. దీంతో పాలన అంతా ఆయన వ్యక్తిగత సహాయకులు (పీఏ) సాగిస్తూ భారీ దందాకు తెరలేపారు. ప్రైవేటు వ్యాపారుల దగ్గర వసూళ్లు నుంచి రూ.కోట్లు విలువ చేసే భూ కబ్జాల వరకు తలా ఓ విభాగం పంచుకుని భారీ దోపిడీ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అసాంఘిక కార్యక్రమాల్లో ఒకరు.. అధికారులను నియంత్రించడంలో మరొకరు, టెండర్లు, నియామకాలు పర్యవేక్షణలో మరొకరు.. దాడులు, అక్రమ కేసులు, గొడవలను ఇంకొకరు చూస్తున్నారు.
షాడో ఎమ్మెల్యేలుగా..
నలుగురు అనుచరులు షాడో ఎమ్మెల్యేలుగా.. ఇన్‌చార్జ్‌లుగా వ్యవహరిస్తుంటారు. అన్నింటా వారై వ్యవహరిస్తూ అధికారులను సైతం ఇరకాటంలోకి పెడుతుంటారు. అధికారులను శాసిస్తూ ప్రభుత్వ వ్యవస్థలన్నింటినీ నియంత్రణలోకి తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల వైఎస్సార్ సీపీ కార్యాలయంపై దాడికి కుట్ర చేసి అమలు చేశారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే దాడికి దిగి.. ప్రశ్నించిన వారిపైనే అక్రమ కేసులు పెట్టించారు.
భారీగా భూఆక్రమణలు..
హిందూపురంలో దండు రోడ్డు సమీపంలో ఆర్యవైశ్యులకు చెందిన రూ. 50 కోట్ల విలువైన 5.90 ఎకరాల భూమిని ఆక్రమించేందుకు యత్నించారు. చిలమత్తూరు మండలం టేకులోడు ప్రాంతంలో ఎకరా రూ. 25 లక్షల విలువైన రైతుల భూములను బలవంతంగా రూ. 12.66 లక్షలకు తగ్గించి బినామీ కంపెనీలకు కట్టబెట్టారు. మున్సిపాలిటీ స్థలాలు, సర్వే నంబర్ 259–1లోని భూమిని కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టారు.
వ్యాపారుల వద్ద దందాలు..
తూముకుంట పారిశ్రామికవాడలోని ప్రతి పరిశ్రమ నుంచి నెలవారీగా రూ.లక్షలు వసూలు చేస్తారని బాధితులు గగ్గోలు పెడుతున్నారు. అంతేకాకుండా గుజరీ (స్క్రాప్) వ్యాపారుల వద్ద ప్రతి నెలా రూ. 50 వేలు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. డబ్బులివ్వని పక్షంలో బెదిరింపులకు దిగి వ్యాపారాలను అడ్డుకున్న ఘటనలూ ఉన్నాయి.
కాంట్రాక్టులు, టెండర్లలో గోల్‌మాల్..
రూ.92 కోట్ల మున్సిపల్ అభివృద్ధి పనుల టెండర్లను తమ అనుకూల కాంట్రాక్టర్ల కోసం రద్దు చేయించి.. 5 శాతం ఎక్సెస్ బిడ్డింగ్‌తో రూ.కోట్ల ప్రజాధనాన్ని పక్కదారి పట్టించారు. పనులు చేయకుండానే అధికారుల సాయంతో బిల్లులు పెట్టి ప్రతి మండలం నుంచి రూ. 30 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకు నిధులు మింగేసినట్లు తెలిసింది. నియోజకవర్గంలో ప్రతి కాంట్రాక్టు.. టెండర్ల నుంచి కమీషన్ డిమాండ్ చేస్తున్నారు.
జనన – మరణ పత్రాల జారీలోనూ..
టౌన్ ప్లానింగ్ అనుమతులు, భవన నిర్మాణ మంజూరు, జనన–మరణ ధ్రువీకరణ పత్రాల జారీలోనూ లంచాలు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. అంతేకాకుండా పీఎం సూర్య ఘర్ పథకం కింద తమకు అనుకూలమైన వెండర్ వద్ద మాత్రమే సోలార్ సామగ్రి కొనుగోలు చేయాలని మున్సిపల్ అధికారులతో హుకుం జారీ చేయించి కమీషన్లు పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఏవైనా ఆరోపణలు రాగానే కనిపించకుండా పోతున్న పీఏలు రెండు, మూడు వారాల తర్వాత యథావిధిగా దందాకు పాల్పడుతున్నారు.
హిందూపురంలో
ఎమ్మెల్యే బాలయ్య పీఏల దందా
నియోజకవర్గాన్ని తలో వైపు
పంచుకుని భారీగా దోపిడీ
అధికారులపై పెత్తనం ఒకరిది.. వసూళ్లు మరొకరివి
జూదం, బియ్యం దందాలో
మరో సహాయకుడు
భూకబ్జాలు, దౌర్జన్యాల్లో ఇంకో పీఏ
ఇబ్బందులు పడుతున్న సామాన్యులు


