పుట్టపర్తి అర్బన్: తమకు హక్కుగా సంక్రమించిన భూములను కొందరు దౌర్జన్యంగా ఆక్రమించుకుంటున్నారని, అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని సోమందేపల్లికి చెందిన హుస్సేన్‌బీ, కుళ్లాయప్ప కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. సోమవారం పుట్టపర్తి మండల పరిధిలోని మామిళ్లకుంట క్రాస్‌లోని రెవెన్యూ భవన్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ శ్యాంప్రసాద్, జేసీ మౌర్య భరద్వాజ్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై మొత్తంగా 310 అర్జీలు అందగా, వాటిని ఆయా శాఖలకు పంపి పరిష్కరించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ‘పరిష్కార వేదిక’కు వచ్చిన సోమందేపల్లికి చెందిన హుస్సేన్‌బీ, కుళ్లాయప్ప తమ భూముల ఆక్రమణపై ఫిర్యాదు చేశారు. తమకు సోమందేపల్లిలోని సర్వే నంబర్ 145లో 2 ఎకరాల భూమి ఉందని, అందులోనే ఇళ్లు నిర్మించుకుని పంటలు సాగు చేసుకుంటున్నామన్నారు. తమ భూమిపై వివాదం నెలకొనగా హైకోర్టును ఆశ్రయించామని, ప్రస్తుతం కేసు పెండింగ్‌లో ఉందన్నారు. ఇదే అదనుగా ఈనెల 14న కొందరు వ్యక్తులు వచ్చి జేసీబీతో 6 మామిడి చెట్లు తొలగించి 40 సెంట్ల భూమిని ఆక్రమించి కంచె వేశారన్నారు. అడ్డుకోబోయిన తమపై దౌర్జాన్యనికి దిగారన్నారు. ఇప్పటికే పలుమార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని కన్నీటి పర్యంత మయ్యారు. న్యాయం చేయాలని వేడుకున్నారు.
శ్మశానవాటికను ఆక్రమించారు
రామగిరి మండలం సుద్దకుంటపల్లికి చెందిన గంతిమర్రి పొలం సర్వే నంబర్ 116లోని వంక పొరంబోకు స్థలాన్ని అధికారులు శ్మశానవాటికకు కేటాయించగా, దీన్ని ఇటీవల కొంతమంది ఆక్రమించారని సుద్దకుంటపల్లికి చెందిన నవదీప్, సురేంద్ర కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. చివరకు శ్మశానంలోని సమాధులను తొలగించారని వాపోయారు. ఆ స్థలాన్ని పరిరక్షించి శ్మశాన వాటికకు కేటాయించాలని కోరారు.
కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన బాధితులు
‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’కు 310 అర్జీలు


