పుట్టపర్తి అర్బన్: వీబీజీ– రాంజీ పథకం కింద కూలీలకు పనులు కల్పిస్తూ చెరువులు, కుంటలు, కాలువల మరమ్మతు పనులు పూర్తి చేయాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఆదేశించారు. సోమవారం ఆయన కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో ఇరిగేషన్, డ్వామా అధికారులతో ‘జలధార–జలహారతి–2.0’ కార్యక్రమం గురించి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా 5,200 పనులకు గాను 1,784 పనులు ప్రారంభమయ్యాయన్నారు. వీటికి రూ.38.13 కోట్లు వ్యయం చేస్తున్నట్లు చెప్పారు. తాజాగా ముదిగుబ్బ, లేపాక్షి, నల్లచెరువు, రొద్దం, హిందూపురం మండలాల పరిధిలో మొత్తం 424 నూతన పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇరిగేషన్ అధికారులు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కింద అవసరమైన రిపేరీలను పూర్తి చేయాలన్నారు. జల సంరక్షణ పనులను శరవేగంగా పూర్తి చేయాలన్నారు. సమావేశంలో ఇరిగేషన్ ఎస్‌ఈ రాజగోపాల్, ఈఈ గురుమూర్తి, డ్వామా పీడీ విజయ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
నకిలీ నోట్ల చెలామణి కేసులో మరొకరి అరెస్ట్
అగళి: నకిలీ నోట్ల చెలామణి కేసులో అగళి పోలీసులు మరొకరిని అరెస్టు చేశారు. రూ.500 నోట్లు ఇచ్చి ఓ కిరాణా దుకాణదారుడిని బురిడీ కొట్టించిన కేసులో ఈ నెల 14న ఇద్దరిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇదే కేసులో మరొకరిని అరెస్ట్ చేసినట్లు మడకశిర రూరల్ సీఐ రాజ్‌కుమార్ తెలిపారు. సోమవారం సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ రాజ్‌కుమార్, అగళి ఎస్‌ఐ రంగడుయాదవ్ మాట్లాడారు. నకిలీ నోట్ల చెలామణి కేసులో కర్టాటక రాష్ట్రం చిక్కబళ్లాపూర జిల్లా గౌరీబిదనూరు తాలూకా గంగసంద్ర గ్రామానికి చెందిన ఇషాక్ ఖాన్ సాబ్‌ను మూడో ముద్దాయిగా గుర్తించి సోమవారం గౌరీబిదనూరులోని విశాల్ మార్ట్ వద్ద అదుపులోకి తీసుకున్నామన్నారు. నిందితుని వద్ద నుంచి 10 నకిలీ రూ,500 నోట్లతో పాటు రూ. 2300 విలువైన ఒరిజినల్ రూ.100 నోట్ల స్వాదీనం చేసుకుని కేసు నమోదు చేశామన్నారు. ఈ వ్యవహారంలో ఇతర వ్యక్తుల ప్రమేయంపై దర్యాప్తు కొనసాగుతోందని సీఐ వెల్లడించారు. ఎవరైనా అపరిచితులు చిల్లర కోసం అడిగినప్పుడు నోట్లను జాగ్రత్తగా పరిశీలించి తీసుకోవాలని, అలాగే నకిలీ కరెన్సీ నోట్లను గుర్తిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో సిబ్బంది పాల్గొన్నారు.
27న జెడ్పీ
సర్వసభ్య సమావేశం
అనంతపురం న్యూటౌన్: ఉమ్మడి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈ నెల 27న నిర్వహించనున్నట్లు జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ తెలిపారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యలు, గ్రామీణాభివృద్ధి, విద్య, వైద్యం, తాగునీరు, పారిశుధ్యం తదితర అంశాలపై చర్చించి, సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు, సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అందేలా తీసుకోవాల్సిన చర్యలపైనా చర్చిస్తామని గిరిజమ్మ చెప్పారు. జిల్లా పరిషత్ సభ్యులు, ప్రజాప్రతినిధులు, జిల్లాస్థాయి అధికారులు సమావేశానికి హాజరు కావాలన్నారు,
జిల్లాస్థాయి శాఖాధిపతులు, అధికారులు తమ శాఖల పురోగతి నివేదికలతో తప్పక హాజరుకావాలని సీఈఓ విజయలక్ష్మి తెలిపారు.
30న ఉచిత
కృత్రిమ చేతుల పంపిణీ
అనంతపురం సిటీ: ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా శాఖ, రోటరీ క్లబ్–అనంతపురం సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 30న కృత్రిమ చేతుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు సొసైటీ మేనేజింగ్ కమిటీ సభ్యుడు దాసరి భరత్, ట్రెజరర్ సుంకర రమేష్, బిసాతి భరత్ తెలిపారు. రాయలసీమ ప్రాంతంలోని ఆరు జిల్లాల పరిధిలో మోచేతి కింది భాగంలో చేయి కోల్పోయిన దివ్యాంగులకు ఉచితంగా కృత్రిమ చేతులను అందజేయనున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన వారు ముందుగా 88663 06969కు నంబర్‌కు ఫోన్ చేసి వివరాలను నమోదు చేసుకోవాలన్నారు.


