యువకుడిపై కత్తితో దాడి | - | Sakshi
Sakshi News home page

యువకుడిపై కత్తితో దాడి

Aug 25 2026 12:09 AM | Updated on Aug 25 2026 12:09 AM

హిందూపురం టౌన్‌: మండల పరిధిలోని కొటిపి పంచాయతీ ఇస్లాంపురం వద్ద ర్యాష్‌ డ్రైవింగ్‌ ఘటన ఘర్షణకు దారితీసింది. వివరాల మేరకు ఇస్లాంపురం వద్ద సోమవారం అబూబకర్‌ సిద్దిక్‌ ద్విచక్రవాహనంలో రోడ్డుపై నిలబడి ఉండగా సందీప్‌ అనే యువకుడు ద్విచక్ర వాహనంలో వెళ్తూ వారిని ఢీకొట్టాడు. దీంతో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అక్కడి నుంచి వెళ్లిన సందీప్‌ తన ఇద్దరు స్నేహితులతో మరలా వచ్చి కత్తితో తనపై దాడి చేశారని అబూబకర్‌ సిద్దిక్‌ తెలిపారు. గాయపడిన అబూబకర్‌ను చికిత్స నిమిత్తం హిందూపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి తీసుకెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

గుండెపోటుతో

ఉపాధి కూలీ మృతి

పెనుకొండ రూరల్‌: గుండెపోటుతో ఉపాధి కూలీ మృతి చెందాడు. సోమవారం మండలంలోని కురుబవాండ్లపల్లికి చెందిన కిష్టప్ప (62) స్థానిక వంగసాని కొండలో వీబీజీ రాంజీ పనులకు వెళ్లాడు. పనులు చేస్తున్న సమయంలో ఛాతీలో నొప్పి రావడంతో కుప్పకూలిపోయాడు. తోటి కూలీలు సపర్యలు చేసి 108కి సమాచారం అందించేలోపే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎంపీడీఓ ఉమాదేవి, ఏపీఓ సంజీవరెడ్డి కిష్టప్ప మృతుని నివాసానికి చేరుకుని నివాళులర్పించారు. ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందిస్తామని ఎంపీడీఓ తెలిపారు. మృతునికి భార్య ఆదిలక్ష్మి, కుమారులు రవి, కేశవయ్య, ఉమా శంకర్‌ ఉన్నట్లు ఏపీఓ తెలిపారు.

ప్రైవేట్‌ బస్సు

ఢీకొని ఇద్దరికి గాయాలు

గుత్తి రూరల్‌: ప్రైవేట్‌ బస్సు ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలైన ఘటన మండలంలోని కొత్తపేట గ్రామ శివారులో 44వ నంబర్‌ జాతీయ రహదారిపై జరిగింది. పోలీసులు, బాధితులు తెలిపిన మేరకు.. వైఎస్సార్‌ కడప జిల్లా చిన్న కనమల గ్రామానికి చెందిన రఘురామయ్య, నంద్యాల జిల్లా గోరుమానుపల్లికి చెందిన చెక్క శివయ్యలు సోమవారం చిన్న కనమలకు బైక్‌లో బయలుదేరారు. కొత్తపేట గ్రామ శివారులో వీరి బైక్‌ను ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు ఢీకొంది. దీంతో తీవ్రంగా గాయపడిన రఘురామయ్య, శివయ్యను స్థానికులు వెంటనే గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్సలకు అనంతపురం తీసుకెళ్లారు. ప్రమాదానికి కారణమైన బస్సును పోలీసులు స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఎంఈఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా బండారు శంకర్‌

అనంతపురం ఎడ్యుకేషన్‌: మాదిగ ఉద్యోగుల సమాఖ్య (ఎంఈఎఫ్‌) ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా జిల్లాకు చెందిన బండారు శంకర్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రెండు రోజుల కిందట హైదరాబాద్‌లో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశంలో ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. 1996లో విద్యార్థి దశలోనే ఎమ్మార్పీఎస్‌ ఉద్యమంలోకి ప్రవేశించిన బండారు శంకర్‌ అప్పటి నుంచి సంఘం కార్యకలాపాల్లో కీలకంగా పనిచేశారు. 2002లో ఉపాధ్యాయుడిగా ఎంపికై న అనంతరం మాదిగ ఉద్యోగుల సమాఖ్యలో తన ప్రస్థానాన్ని కొనసాగించారు. 2002 నుంచి 2007 వరకు జిల్లా ఆర్గనైజింగ్‌ సెక్రటరీగా, 2007 నుంచి 2011 వరకు రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీగా, 2011 నుంచి 2014 వరకు రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శిగా, 2014 నుంచి 2021 వరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, 2021 నుంచి 2026 వరకు జాతీయ అదనపు ప్రధాన కార్యదర్శిగా సేవలందించారు.

పీఏబీఆర్‌లో పెరుగుతున్న నీటి మట్టం

కూడేరు: మండల పరిధిలోని పెన్నహోబిలం బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌లో నీటిమట్టం పెరుగుతోంది. ఈ నెల 15న 1.85 టీఎంసీలు ఉన్న నీరు సోమవారానికి 2.09 టీఎంసీలకు చేరినట్లు డ్యాం ఇరిగేషన్‌ అధికారులు తెలిపారు. తాగునీటి సౌకర్యార్థం ఈ నెల 15 నుంచి తుంగభద్ర జలాశయం నుంచి హెచ్చెల్సీ ద్వారా డ్యాంలోకి నీటిని సరఫరా చేశారు. మొదట్లో 100 క్యూసెక్కులు సరఫరా కాగా ప్రస్తుతం 480 క్యూసెక్కులు వచ్చి చేరుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement