తన్నుకున్న జనసేన మహిళా కార్యకర్తలు? | - | Sakshi
Sakshi News home page

తన్నుకున్న జనసేన మహిళా కార్యకర్తలు?

Aug 25 2026 12:09 AM | Updated on Aug 25 2026 12:09 AM

సాక్షి, టాస్క్‌ఫోర్స్‌: హిందూపురం జనసేన పార్టీలో విభేదాలు భగ్గుమన్నాయి. పట్టణంలోని టీచర్స్‌ కాలనీలో ఆ పార్టీకి చెందిన రాష్ట్ర సగర కార్పొరేషన్‌ డైరెక్టర్‌ మణిప్రియ, అదే పార్టీకి చెందిన బెల్లం రేణుకలు పరస్పరం దూషించుకోవడంతో పాటు తన్నుకున్నట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న 2వ పట్టణ పోలీసులు టీచర్స్‌ కాలనీకి వెళ్లి పరిస్థితి అదుపులోకి తెచ్చినట్టు సమాచారం. స్టేషన్‌ వరకూ పంచాయితీ వెళ్లకుండా ఆ పార్టీ పెద్దలు రాజీ కుదిర్చినట్లు తెలిసింది. పది మందికి ఆదర్శంగా నిలవాల్సిన మహిళా నేతలు కొట్టుకోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారించాలి

పెనుకొండ రూరల్‌: యువత నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారిస్తే జీవితంలో త్వరగా స్థిరపడేందుకు దోహద పడుతుందని ఆర్డీఓ ఆనంద్‌ కుమార్‌ అన్నారు. కియా సీఎస్‌ఆర్‌ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో యువతకు హైదరాబాద్‌కు చెందిన యునైటెడ్‌ వే సంస్థ ఆధ్వర్యంలో సోలార్‌ ఎనర్జీపై 5 రోజుల పాటు ఉచిత శిక్షణ ఇచ్చారు. సోమవారం శిక్షణ ముగింపు సందర్భంగా ఆర్డీఓ చేతుల మీదుగా సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పరిశ్రమల శాఖ జిల్లా అధికారి నాగరాజు, ప్రిన్సిపాల్‌ నాగశశి కళ, యునైటెడ్‌ వే సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

రైల్వే ఎంప్లాయీస్‌ సొసైటీ డైరెక్టర్‌గా రాజ్‌కుమార్‌

గుంతకల్లు: స్థానిక ఇంజినీరింగ్‌ బ్రాంచ్‌ సెక్రటరీగా పని చేస్తున్న రాజ్‌కుమార్‌ దక్షిణ కోస్తా రైల్వే ఎంప్లాయీస్‌ కో ఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీ డైరెక్టర్‌గా ఎంపికయ్యారు. సోమవారం విశాఖపట్నంలో 87వ సొసైటీ జనరల్‌ బాడీ మీటింగ్‌ నిర్వహించారు. సమావేశానికి సొసైటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ చిలకం స్వామి, దక్షిణ కోస్తా రైల్వే మజ్దూర్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి శంకర్‌రావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గుంతకల్లు డీఆర్‌ఎం కార్యాలయంలోని రెల్వే ఎంప్లాయీస్‌ కో ఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీ డైరెక్టర్‌గా రాజ్‌కుమార్‌ను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సొసైటీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. మజ్దూర్‌ యూనియన్‌ గుంతకల్లు డివిజన్‌ ప్రధాన కార్యదర్శి అశ్విని, నాయకులు శ్రీనివాస శర్మ, మస్తాన్‌వలి తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు.

29న ఉద్యోగ మేళా

గోరంట్ల: స్థానిక ఏఎన్‌కే డిగ్రీ కళాశాలలో ఈ నెల 29న రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్‌ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ లక్ష్మినారాయణ పేర్కొన్నారు. 10వ తరగతి, ఇంటర్‌, డిగ్రీ, ఐటీఐ, బీటెక్‌ విద్యార్హతలున్న వారు అర్హులన్నారు. 18–30 మధ్య వయసుండాలన్నారు. ఏథర్‌ ఎనర్జీ, ఫాక్స్‌రాన్‌, టాటా ఎలక్ట్రికల్‌, కియో ఇండియా, బర్జర్‌ పెయింట్స్‌ తదితర కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. ఎంపికై న వారికి రూ.13,000 నుంచి రూ. 25,000 వరకు జీతం ఉంటుందన్నారు. కొన్ని కంపెనీల్లో ఉచిత వసతి, రవాణా సౌకర్యాలు కూడా ఉంటాయన్నారు. ఆసక్తి ఉన్న వారు htpp:// naipunyam.ap.gov.in ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలన్నారు.

విద్యుత్‌ షాక్‌తో మహిళ మృతి

నార్పల: మండల పరిధిలోని దుర్గం గ్రామానికి చెందిన రాజేశ్వరి (40) సోమవారం రాత్రి విద్యుత్‌ షాక్‌కు గురై మృతి చెందింది. స్థానికులు తెలిపిన మేరకు.. రాజేశ్వరి భర్త గతంలోనే అనారోగ్యంతో మృతి చెందాడు. ఆమెకు ఒక కుమార్తె, పదేళ్ల కుమారుడు ఉన్నారు. కుమార్తెకు కొన్ని రోజుల క్రితమే వివాహం జరగ్గా.. ప్రస్తుతం రాజేశ్వరి తన కుమారుడితో కలిసి జీవిస్తోంది. శనివారం వీరి ఇంటి ముందు ఉన్న రేకుల షెడ్డుకు విద్యుత్‌ ఎర్త్‌ అయ్యింది. ఈ విషయం గుర్తించని ఆమె షెడ్డును ముట్టుకోవడంతో షాక్‌కు గురై పడిపోయింది. రాజేశ్వరి కుమారుడు ఏడుస్తూ చుట్టుపక్కల వాళ్లను పిలిచాడు. వాళ్లు వచ్చి పరిశీలించే సరికే ఆమె మృతి చెందింది. తల్లి మృతదేహం వద్ద కుమారుడు విలపించిన తీరు అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement