అనంతపురం ఎడ్యుకేషన్: ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల హక్కుల కోసం అనేక ఉద్యమాలు చేసి, లెక్చరర్ల సమస్యల పరిష్కారానికి విశేషంగా కృషి చేసిన ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రముఖ విద్యావేత్త సి. సుబ్బరామిరెడ్డి ఆదివారం కన్నుమూశారు. ఆయన మరణం ఇంటర్ విద్యారంగానికి, లెక్చరర్లు, ప్రిన్సిపాళ్ల సంఘాలకు తీరని లోటని పలువురు సంతాపం వ్యక్తం చేశారు. వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు తాలూకా దేవగుడి గ్రామానికి చెందిన సుబ్బరామిరెడ్డి 1975లో రైల్వేకోడూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో భౌతికశాస్త్ర లెక్చరర్‌గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. అనంతపురం న్యూ టౌన్ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు బదిలీపై వచ్చిన అనంతరం జిల్లా ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. ప్రిన్సిపాల్‌గా పదోన్నతి పొందిన ఆయన జిల్లాలో సుదీర్ఘ కాలం పని చేశారు. రాష్ట్ర జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్ల సంఘానికి సుబ్బరామిరెడ్డి నాయకత్వం వహించారు. ఉద్యోగ జీవితంలో తనను ఆశ్రయించిన లెక్చరర్లు, ప్రిన్సిపాళ్లకు సహాయ సహకారాలు అందిస్తూ, సమస్యల పరిష్కారానికి సలహాలు ఇస్తూ అందరి మన్ననలు పొందారు. 2007లో పెనుకొండలో పని చేస్తూ పదవీ విరమణ చేశారు. లెక్చరర్ల సమస్యలపై నిరంతరం పోరాడిన నాయకుడిగా, విద్యారంగ అభివృద్ధికి అంకితభావంతో పనిచేసిన విద్యావేత్తగా ఆయన సేవలు చిరస్మరణీయమని లెక్చరర్లు పేర్కొన్నారు. ఆయన లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిదని తెలిపారు.


