పుట్టపర్తి అర్బన్: ‘చంద్రబాబు ప్రభుత్వానికి దళితులంటే అలుసైపోయారు. గతంలోనే ఆయన దళితునిగా పుట్టాలని ఎవరనుకుంటారని మనసులోని మాటను బయటపెట్టారు. చంద్రబాబు ఎప్పటికీ దళితులకు న్యాయం చేయరు. వచ్చే ఎన్నికల్లో పోలింగ్‌ను బాయ్‌కాట్ చేస్తాం’ అని వామపక్ష పార్టీల నాయకులు అన్నారు. జిల్లాలోని 71 దళిత కాలనీల్లో నెల రోజుల పాటు వామపక్ష పార్టీల నాయకులు పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు. సమస్యలను కలెక్టర్‌కు నివేదించడానికి సోమవారం మామిళ్లకుంట క్రాస్ నుంచి రెవెన్యూ భవన్‌కు ర్యాలీగా చేరుకున్నారు.
వర్షంలోనూ కొనసాగిన నిరసన
వినతి పత్రాలు ఇవ్వడానికి లోనికి పోలీసులు అనుమతించక పోవడంతో రెవెన్యూ భవన్ ఎదుట రెండు గంటలకు పైగా నాయకులు బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఒక పక్క వర్షం కురుస్తున్నా పట్టు వదలకుండా నిరసన కొనసాగించారు. ఎంత పిలిచినా కలెక్టర్ బయటకు రాకపోవడం, పోలీసులు గేట్లు తెరవకపోవడంతో ఆగ్రహోదగ్రులయ్యారు. గేట్లు ఎక్కేందుకు యత్నించారు. అనంతరం వర్షానికి తడిసిన అర్జీలనే కలెక్టర్ శ్యాం ప్రసాద్‌కు అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఓబులు మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంలో దళితులకు స్వేచ్ఛగా తిరిగే హక్కు లేకుండా పోయిందన్నారు. జీఓ 1235 ప్రకారం దళిత వాడలకు సంబంధించి శ్మశాన వాటికలకు భూమి కేటాయించాలన్నారు. వైఎస్సార్ హయాంలో ఏటా సబ్‌ప్లాన్ నిధుల కింద రూ.15 వేల కోట్లు విడుదల చేసే వారని, ఆ తర్వాత ఒక్క రూపాయి విడుదల చేయలేదని విమర్శించారు. జస్టిస్ పున్నయ్య కమిషన్, కోనేరు రంగారావు కమిషన్ సిఫారసులను వెంటనే అమలు చేయాలన్నారు. ప్రతి దళిత కుటుంబానికీ రెండెకరాల సాగు భూమి ఇవ్వాలన్నారు. దళిత కాలనీల్లో మంచి నీరు, రోడ్లు, కాలువలు, వీధిలైట్లు ఏర్పాటు చేయాలన్నారు. కదిరి, హిందూపురం, పాలసముద్రం, చిలమత్తూరు, పెనుకొండ, నల్లచెరువు, తనకల్లుల్లో గుడిసెలు వేసుకున్న పేదలకు ఇంటి పట్టాలు మంజూరు చేయాలన్నారు. హాస్టల్ విద్యార్థులకు మెస్ చార్జీలు పెంచాలన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌ను పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాకు వ్యవసాయ కార్మిక సంఘం, సీపీఎం, కాంగ్రెస్ విద్యార్థి సంఘం, మహిళా సంఘాలు మద్దతు నిచ్చాయి. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రామక్రిష్ణ, నాయకులు నరసింహులు, రైతు సంఘం నాయకులు హరి, జంగాలపల్లి పెద్దన్న, జెడ్పీటీసీ లక్ష్మీనారాయణ, వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి ప్రవీణ్, బ్యాళ్ల అంజీ, సాంబ, గంగాధర్, పెడపల్లి బాబా, ఐద్వా నాయకురాలు దిల్షాద్, శ్రావణి, సహన, సిద్దూ తదితరులు ఉన్నారు.


