అనంతపురం క్రైం: ప్రయాణికుల భద్రతే ప్రధానమని చెప్పే ఆర్టీసీ బస్సుల్లో ప్రమాదకర, నిషేధిత వస్తువుల రవాణా యథేచ్ఛగా సాగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. బస్సుల్లో యాసిడ్, పేలుడు పదార్థాలు, గ్యాస్ సిలిండర్లు, టపాసులు తదితర వస్తువులను తీసుకెళ్లడం నిషేధమని ఆర్టీసీ నిబంధనలు స్పష్టం చేస్తున్నా కార్గో బుకింగ్ కేంద్రాల్లో వాటిని అడ్డుకునే వ్యవస్థ ఎక్కడ పనిచేస్తోందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇటీవల బళ్లారి ఆర్టీసీ కార్గో కేంద్రంలో రెండు యాసిడ్ క్యాన్లు, రేయాన్ గ్రేడ్ కాస్టిక్ సోడా ఫ్లెక్స్–టీజీవీ99 పౌడరు ప్యాకెట్ల తరలింపునకు బుక్ చేయడం, వాటిని అనంతపురం తీసుకువచ్చిన అనంతరం కడప తీసుకెళ్లేందుకు మరో బస్సులోకి షిఫ్ట్ చేయడం, ఈ బస్సు వైఎస్సార్ జిల్లా కమలాపురం సమీపంలో ప్రమాదానికి గురవడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
స్కానర్‌లు లేక పోవడం సమస్య..
బస్సుల్లో ప్రమాదకర రసాయనాలను తరలించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. బుకింగ్ సమయంలోనే సరుకు స్వరూపాన్ని గుర్తించకుండా, ప్రమాదం జరిగిన తర్వాత స్పందించి ప్రయోజనం ఏమిటని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. బళ్లారిలో బుక్కయిన కెమికల్ పౌడరు వివరాలు బ్యాగుపై స్పష్టంగా కనిపిస్తున్నా, నిషేధిత వస్తువు అని పెద్ద అక్షరాలతో రాసినా కార్గో సిబ్బంది బుక్ చేయడాన్ని కాసుల కోసం కక్కుర్తి పడటం కాక ఇంకేమంటారంటూ ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏజెన్సీలకు అడ్డగోలుగా కాంట్రాక్టు ఇస్తున్న సంస్థ యాజమాన్యం కనీసం స్కానర్‌లు వాడాలని సూచించకపోవడం దారుణమని విమర్శిస్తున్నారు. పార్సిల్ వస్తువు బస్సులోకి చేరడానికి కనీసం మూడు దశలు దాటాల్సి ఉంటుంది. బుకింగ్, ప్యాకింగ్, లోడింగ్ దశల్లో ఒక్కచోటైనా తనిఖీ జరిగితే ప్రమాదకర సరుకును అడ్డుకోవచ్చు. తాజాగా బుకింగ్ కేంద్రంలోనే నిషేధిత వస్తువు నమోదైతే అది ఎలా జరిగిందన్నదే కీలక ప్రశ్నగా మారింది. నిషేధిత వస్తువుల విషయంలో ఇదే మొదటి ఘటన కాదని, గతంలోనూ పేలుడు పదార్థాలు దొరికినా కఠిన చర్యలు తీసుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. సెల్‌ఫోన్లను సాధారణ పార్శిళ్లుగా కాకుండా రుసుమును ఎగ్గొట్టేందుకు గిఫ్ట్ బాక్స్ తరహాలో పంపుతున్న వ్యవహారం కూడా అనుమానాలకు తావిస్తోంది. నిజంగా ఏ వస్తువు బుక్ అవుతోంది.. ఎవరు పంపిస్తున్నారు.. ఎవరు స్వీకరిస్తున్నారు.. వరుసగా ఒకే రకమైన పార్శిళ్లు వస్తుంటే వాటిపై పర్యవేక్షణ ఉందా.. అన్నది తేలాల్సి ఉంది. ఈ విషయంలో ఆర్టీసీ ఉన్నతాధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బస్టాండ్ నిర్వహణ, కార్గో కార్యకలాపాలు, బుకింగ్ విధానం, పార్శిళ్ల తనిఖీలపై నిరంతర పర్యవేక్షణ ఉండాల్సిన బాధ్యత అధికారులదే. కానీ బస్టాండులోకి వచ్చి కార్గో నిర్వహణను స్వయంగా పరిశీలించని అధికారులు ఉంటే కౌంటర్ స్థాయిలో ఏం జరుగుతుందో ఉన్నతాధికారులకు ఎలా తెలుస్తుందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ఆర్టీసీలో యథేచ్ఛగా ప్రమాదకర వస్తువుల రవాణా
స్కానర్‌లు లేకపోవడంతోనే సమస్య


