● ప్రశాంతి నిలయంలో ప్రారంభమైన ఓనం వేడుకలు
పుట్టపర్తి అర్బన్: కేరళీయులు అత్యంత పవిత్రంగా చేసుకునే ఓనం వేడుకలు ప్రశాంతి నిలయంలో సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఓనం వేడుకలకు కేరళం నుంచి భక్తులు, సత్యసాయి విద్యాసంస్థల పూర్వ విద్యార్థులు పెద్ద ఎత్తున విచ్చేశారు. తొలి రోజైన సోమవారం సాయంత్రం 4.30 గంటలకు వేద పఠనంతో కార్యక్రమాలను ప్రారంభించారు. 5 గంటలకు ‘సాయి భవరసం’ పేరుతో సంగీత కచేరీ నిర్వహించారు. ప్రముఖ సంగీత విద్వాంసురాలు గాయత్రి వైద్యనాథన్ బృందం సత్యసాయిని కీర్తిస్తూ ఆలపించిన గీతాలతో భక్తుల తన్మయత్వం చెందారు. అనంతరం మంగళ హారతితో కార్యక్రమాలు ముగిశాయి. మంగళవారం ఉదయం యువ సందేశకుడు రఘువీర గాద్యం గీతాలాపన, సాయంత్రం కేరళం హైకోర్టు చీఫ్ జస్టీస్ సుమన్ సేన్ ప్రసంగం, మహతీ బృందం సంగీత కచేరీ ఉంటుందని సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్ రాజు తెలిపారు. ఓనం వేడుకల నేపథ్యంలో సాయికుల్వంత్ మందిరాన్ని అందంగా తీర్చి దిద్దారు.


