టీడీపీ జెండా మోసినా.. పింఛన్‌ రాలేదు | - | Sakshi
Sakshi News home page

టీడీపీ జెండా మోసినా.. పింఛన్‌ రాలేదు

Aug 25 2026 12:21 AM | Updated on Aug 25 2026 12:21 AM

పుట్టపర్తి అర్బన్‌: ‘‘రామారావు పార్టీ పెట్టినప్పటి నుంచీ నేను టీడీపీనే. ప్రతి ఎన్నికల్లోనూ టీడీపీ జెండా మోసిన. ఊరూరు తిరిగి ప్రచారం చేసి స్థానిక ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి గెలుపునకు కుటుంబమంతా శ్రమించాం. పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా పైసా సాయం చేయలేదు. ఇటీవలే అనారోగ్యంతో ఒక కాలు తీసేశారు. పింఛన్‌ కోసం దరఖాస్తు చేసుకుంటే మంజూరు చేయలేదు. ఇల్లు గడవడం కూడా కష్టంగా మారింది. అయినా పార్టీకి ఇన్నేళ్లు సేవ చేసిన నన్ను గుర్తుంచుకున్న వారే లేరు’’ అంటూ నల్లమాడ మండలం పులగంపల్లికి చెందిన గంగప్ప ఆవేదన వ్యక్తం చేశారు. గంగప్ప కుమారుడు అనిల్‌కుమార్‌కు కూడా ఇటీవల కదిరి తేరులో జరిగిన ప్రమాదంలో కాలు విరిగింది. ఆపరేషన్‌ వికటించడంతో కాలు సరిగా రాలేదు. వాపు అధికమై నడవలేని పరిస్థితికి చేరుకున్నారు. బతికేందుకు ఎలాంటి ఆధారం లేదు. ఈ పరిస్థితుల్లో గంగప్ప తన కుమారుడిని వెంటబెట్టుకుని సోమవారం పుట్టపర్తిలో జరిగిన ‘పరిష్కార వేదిక’కు వచ్చారు. నడవలేని స్థితిలో ఉన్న అతను దూరం నుంచే డీఆర్‌డీఏ పీడీ ద్వారా తన అర్జీని కలెక్టర్‌కు పంపారు. అనంతరం గంగప్ప విలేకరులతో మాట్లాడారు. తనకు సెంటు భూమి లేదని, పార్టీ అంటూ ఊళ్లుపట్టుకుని తిరుగుతూ ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేశానని, ఫలితంగా షుగర్‌ ఎక్కువై తన కాలు తీసేశారన్నారు. ఇక కదిరి రథోత్సవంలో గాయపడి నడవలేని స్థితిలో ఉన్న తన కుమారుడికి ముగ్గురు పిల్లలు ఉన్నారని, ప్రస్తుతం ఇల్లు గడవడం కష్టంగా మారిందన్నారు. విధిలేని పరిస్థితుల్లో పింఛన్‌ కోసం ఏడాదిన్నరగా నాయకులు, అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని కన్నీటిపర్యంతమయ్యారు. తాను అంతదూరం నుంచి వస్తే కలెక్టర్‌ గారు కనీసం తన వద్దకు వచ్చి తన కష్టాన్ని వినలేకపోయారన్నారు. ఇప్పటికై నా తమపై కనికరం చూపి దివ్యాంగుల పింఛన్‌ మంజూరు చేయాలని కోరారు.

పులగంపల్లికి చెందిన

టీడీపీ కార్యకర్త గంగప్ప ఆవేదన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement