బిల్లు.. ఘొల్లు | - | Sakshi
Sakshi News home page

బిల్లు.. ఘొల్లు

Aug 17 2026 1:53 AM | Updated on Aug 17 2026 1:53 AM

పుట్టపర్తి అర్బన్‌: జిల్లావ్యాప్తంగా 32 మండలాల్లో ఉన్న విద్యుత్‌ బిల్లు చెల్లింపు కేంద్రాలు మూసి వేయడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆండ్రాయిడ్‌ మొబైళ్లు లేని వినియోగదారులు, బిల్లులు చెల్లించే విధానం తెలియని వారు, ఫోన్‌పే, గూగుల్‌ పేలో డబ్బు లేని వారు అవస్థలు పడుతున్నారు. వినియోగదారుల నుంచి విద్యుత్‌ బిల్లులు వసూలు చేసే సిబ్బంది కూడా గ్రామాలకు రాకపోవడంతో మరిన్ని ఇబ్బందులు తప్పడం లేదు. విద్యుత్‌ శాఖ అధికారులు, సిబ్బంది అవగాహన కల్పించకపోవడంతోనే దుస్థితి తలెత్తింది. డిజిటల్‌ చెల్లింపులతో వినియోగదారులు మోసపోయే ప్రమాదం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆండ్రాయిడ్‌ ఫోన్‌ ఉన్నా చెల్లించే విధానం తెలియక ఇతరుల వద్దకు వెళ్తే పెద్ద మొత్తంలో డబ్బు కాజేసే అవకాశం ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. మరోవైపు డిజిటల్‌ దెబ్బకు వందలాది సిబ్బంది కుటుంబాలు కకావికలం కానున్నాయి. గత నెల నుంచి కొంత మంది సిబ్బంది ఎస్‌పీడీసీఎల్‌ ముఖ్య కేంద్రమైన తిరుపతిలో ఆందోళనలు చేసినా ఎవరూ పట్టించుకోక పోవడం గమనార్హం. ఈ క్రమంలో అందరి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని విద్యుత్‌ శాఖ అధికారులు, ప్రభుత్వ పెద్దలు మరోసారి ఆలోచించాలని పలువురు కోరుతున్నారు.

విద్యుత్‌ బిల్లు చెల్లింపు కేంద్రాలు మూసేసిన చంద్రబాబు ప్రభుత్వం

వినియోగదారులకు తప్పని ఇబ్బందులు

ప్రభుత్వ ఆదేశాల మేరకే

ప్రభుత్వ ఆదేశాల మేరకే విద్యుత్‌ బిల్లు చెల్లింపు కేంద్రాలను మూసేశాం. గ్రామాల్లోకి ఇకపై సిబ్బంది వెళ్లరు. బిల్లు మొత్తం డిజిటల్‌ విధానంలోనే చెల్లించాలి. సిబ్బంది ద్వారా గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. ప్రస్తుతం ప్రతి ఒక్కరి వద్ద మొబైల్‌ ఫోన్లు ఉన్నాయి. దీంతో బిల్లు కట్టడం సులభమే.

– మోసెస్‌, విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ

ఏదో ఒక ఉద్యోగం ఇవ్వాలి

రోజూ ఏదో ఒక గ్రామానికి వెళ్లి వినియోగదారుల నుంచి బిల్లులు వసూలు చేస్తూ ఏజెన్సీ వాళ్లు ఇచ్చే వేతనంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నా. ఈ నెలలో బిల్లులు చెల్లించడానికి వీలు లేకుండా చేయడంతో ఉద్యోగం ఊడిపోయింది. ఇప్పటికే తిరుపతిలో పలుమార్లు ధర్నాలు చేశాం. విద్యుత్‌ శాఖలో ఏదో ఒక ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నాం. సమాధానం చెప్పే అధికారులు లేరు.

– నాగేంద్ర, పుట్టపర్తి

ప్రభుత్వం

పునరాలోచించాలి

ఆండ్రాయిడ్‌ ఫోన్‌ ఉన్నా ఫోన్‌ పే యాప్‌ లేదు. దీంతో విద్యుత్‌ బిల్లు చెల్లించలేక ఇబ్బంది పడ్డా. ఇతరుల సహాయంతో బిల్లు చెల్లించాల్సి వచ్చింది. పేదల వద్ద మొబైళ్లు ఉండవు. సకాలంలో డబ్బు ఉండక ఇబ్బందులు తలెత్తుతాయి. మీసేవా, సీఎస్‌పీ సెంటర్‌కు వెళ్తే ప్రతి బిల్లుపై రూ.10 నుంచి రూ.50 అదనంగా వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం మరో సారి ఆలోచించాలి.

– గోవిందు, కొత్తచెరువు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement