● నసనకోట సచివాలయం నిర్మించినా బిల్లులు చేయకుండా కాలయాపన
● ఆత్మహత్యే శరణ్యమంటున్న బాధితుడు
సాక్షి,టాస్క్‌ఫోర్స్: దళితుడిపై కక్ష సాధింపులకు పాల్పడుతుండడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. రామగిరి మండలం కొత్తగేరి గ్రామానికి చెందిన హరిజన ముత్యాలన్న గతంలో పరిటాల రవికి ముఖ్య అనుచరుడిగా ఉండేవాడు. 2019 ఎన్నికల ముందు వైఎస్సార్ సీపీలో చేరాడు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో రామగిరి మండలం నసనకోటలో సచివాలయ నిర్మాణ కాంట్రాక్టు ఈయనకు దక్కింది. అప్పట్లోనే రూ.43 లక్షలతో భవనం పూర్తి చేయగా, రూ.30 లక్షల వరకు బిల్లులు వచ్చాయి. ఎన్నికల కోడ్ రావడంతో మిగిలిన బిల్లులు కాలేదు. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఒక్కసారిగా పరిస్థితి తలకిందులైంది. రెండేళ్ల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు సచివాలయ కిటికీల అద్దాలతో పాటు బయటి మెట్ల పైపులను ధ్వంసం చేశారు. ఈ విషయం అధికారులకు తెలియజేయగా, మరలా వాటిని చేయిస్తే బిల్లులు చేస్తామన్నారు. హరిజన ముత్యాలన్న వారు చెప్పినట్లే చేసినా బిల్లులు మాత్రం అందించలేదు. రెండేళ్లుగా కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిప్పుకుంటున్నారే తప్ప కచ్చితమైన సమాధానం చెప్పడం లేదు. తనకు రూ.15 లక్షలకుపైగా బిల్లులు రావాల్సి ఉందని, వడ్డీలకు డబ్బు తెచ్చి సచివాలయ భవనాన్ని పూర్తి చేస్తే ఇలా చేయడం అన్యాయమని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. రెండేళ్లుగా వడ్డీలు కట్టలేకపోతున్నానని, ఇప్పటికై నా చెల్లించకుంటే ఆత్మహత్యే శరణ్యమని వాపోతున్నాడు.


