విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

Aug 17 2026 1:47 AM | Updated on Aug 17 2026 1:47 AM

కళ్యాణదుర్గం రూరల్‌: కంబదూరు మండల పరిధిలోని జక్కిరెడ్డిపల్లిలో ఆదివారం విద్యుదాఘాతంతో భవన కార్మికుడు బోయ వెంకటేశులు (60)మృతి చెందాడు. పోలీసుల వివరాల మేరకు... కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని ముదిగల్లుకు చెందిన వెంకటేశులుతో పాటు మరో నలుగురు భవన నిర్మాణం కోసం ఆదివారం కంబదూరు మండల పరిధిలోని జక్కిరెడ్డిపల్లిలో భవన నిర్మాణం కోసం రోజువారి కూలికి వెళ్లారు. భవన నిర్మాణం చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తూ విద్యుత్‌ తీగలు తగిలాయి. వెంటనే స్థానికులు వెంకటేశులును సీహెచ్‌సీకి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడుకి భార్య అనిత, ఇద్దరు కుమార్తెలు, కుమారులున్నారు.

వైఎస్సార్‌ విద్యార్థి విభాగం నాయకుడిపై దాడి

ఉరవకొండ: స్థానిక మాస్టర్‌ సీవీవీ నగర్‌లో నివాసముంటున్న వైఎస్సార్‌ విద్యార్థి విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు, ఆల్‌ ఇండియా ఎకలవ్య ఎరుకుల సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సాకే పురుషోత్తంపై ఆదివారం రాత్రి పలువురు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు... పురుషోత్తం హెచ్‌పీ పెట్రోల్‌ బంకు సమీపంలో తన ద్విచక్ర వాహనానికి పెట్రోల్‌ వేసుకొని వస్తుండగా ఉరవకొండ పట్టణానికి చెందిన గాజుల మారుతి, గాజుల అనిల్‌తో పాటు మరికొందరు తనపై దాడి చేశారన్నారు. తీవ్రగాయాలతో పోలీసుస్టేషన్‌కు చేరుకొని దాడి విషయంపై ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. తన కుటుంబ సభ్యులు తనను ఉరవకొండ ఆస్పత్రిలో చేర్పించారన్నారు. తనను కులం పేరుతో దూషించడంతో పాటు కుటుంబ సభ్యులను కూడా దూషించారని చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మట్టి కుప్పను ఢీకొని

వ్యక్తి మృతి

బొమ్మనహాళ్‌: ఫైబర్‌ నెట్‌వర్క్‌ కేబుల్‌ కోసం తవ్విన మట్టి కుప్ప ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. రోడ్డుపై మట్టి వదిలేయడంతో దాన్ని ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని దేవగిరి క్రాస్‌ వద్ద బళ్లారి–కళ్యాణదుర్గం రహదారిపై ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. కణేకల్లు మండలం అంబాపురానికి చెందిన లక్ష్మీరెడ్డి (55)బళ్లారి పట్టణంలో ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం స్వగ్రామంలో వివాహానికి హాజరై తిరిగి బళ్లారికి ద్విచక్ర వాహనంలో బయలుదేరాడు. దేవగిరి క్రాస్‌ వద్ద ఎదురుగా వాహనాలు వస్తుండటంతో రోడ్డుపై మట్టికుప్పను గమనించలేక దాన్ని ఢీకొట్టాడు. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడికి భార్య జ్యోతితో పాటు ఇద్దరు కుమారులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement