విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వడ్డిస్తున్న నిర్వాహకురాలు (ఫైల్)
పుట్టపర్తి : ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు వేడివేడి భోజనం అందించేందుకు తెల్లవారుజాము నుంచే కష్టపడే మధ్యాహ్న భోజన కార్మికులకు ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం తయారు చేస్తున్న 1,854 మంది కార్మికులకు ఒక్కొక్కరికి నెలకు రూ.6 వేల చొప్పున ప్రభుత్వం వేతనం చెల్లిస్తోంది. వారికి నెలకు సుమారు రూ.1.13 కోట్లు అవసరం. అయితే జూన్, జూలై నెలలకు సంబంధించిన వేతనాలు ఇప్పటివరకు జమ కాలేదు. అంటే రెండు నెలలకు సుమారు రూ.2.26 కోట్ల వేతనాలు పెండింగ్‌లో ఉన్నట్లు కార్మికులు చెబుతున్నారు. ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు భారీగా పెరగడంతో రూ.6 వేల వేతనంతో కుటుంబాలను నెట్టుకురావడం కష్టంగా మారిందని, ఇలాంటి పరిస్థితుల్లో నెలల తరబడి వేతనాలు నిలిపివేయడంతో తమ పరిస్థితి మరింత దయనీయంగా మారిందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చార్జీలు సరిపోవు.. బిల్లులు రావు
మధ్యాహ్న భోజన పథకం మెనూను ప్రభుత్వం మార్చింది. విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో మెనూలో మార్పులు చేసినప్పటికీ, పెరిగిన ధరలకు అనుగుణంగా డైట్ చార్జీలు మాత్రం పెంచలేదని ఏజెన్సీ నిర్వాహకులు వాపోతున్నారు. ప్రస్తుతం ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు రోజుకు రూ.6.19, ఉన్నత పాఠశాల విద్యార్థులకు రోజుకు రూ.9.29 చొప్పున డైట్ చార్జీలు చెల్లిస్తున్నారు. జిల్లాలో డైట్ చార్జీల కోసం నెలకు సుమారు రూ.2.43 కోట్లు అవసరం. జూన్, జూలై నెలలకు సంబంధించిన బిల్లులు కూడా చెల్లించకపోవడంతో రెండు నెలలకు సుమారు రూ.4.89 కోట్లు బకాయి ఉన్నట్లు తెలుస్తోంది.
ఏడాదిన్నరగా బిల్లుల్లేవ్
జిల్లాలోని 10 మోడల్ స్కూళ్లకు అనుబంధంగా ఉన్న జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికుల పరిస్థితి దయనీయంగా ఉంది. వారికి సంబంధించిన బిల్లులు ఏడాదిన్నరగా పెండింగ్‌లో ఉన్నాయని కార్మికులు చెబుతున్నారు. వేతనాలు అందకపోయినా విధులు నిర్వహిస్తూ వస్తున్నామని, ఇక కుటుంబాలను ఎలా పోషించుకోవాలో అర్థం కావడం లేదని వారు వాపోతున్నారు. జిల్లాలో మొత్తం 1,957 పాఠశాలలు ఉన్నాయి. వేలాది మంది విద్యార్థులకు రోజూ మధ్యాహ్న భోజనం అందించడంలో కార్మికులు కీలకపాత్ర పోషిస్తున్నారు. అయితే వేతనాల చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు అధికారులు మాత్రం బడ్జెట్ వచ్చిందని కార్మికుల వేతనాలు, డైట్ బిల్లులు పెడుతున్నామని చెబుతున్నారు.
రెండు నెలలుగా కార్మికుల వేతనాలకు ‘చంద్ర’గ్రహణం
ఏజెన్సీల డైట్ బిల్లులకూ బ్రేక్
నిత్యావసరాల ధరలు పెరిగినా
చార్జీలు పెంచని ప్రభుత్వం
తీవ్ర ఇబ్బందుల్లో కార్మికులు,
ఏజెన్సీ నిర్వాహకులు


