ఆత్మకూరులో దొంగల హల్‌చల్‌ | - | Sakshi
Sakshi News home page

ఆత్మకూరులో దొంగల హల్‌చల్‌

Aug 17 2026 1:47 AM | Updated on Aug 17 2026 1:47 AM

ఆత్మకూరు: మండలంలో దొంగలు హల్‌చల్‌ చేశారు. సిద్దరాంపురం, పంపనూరు గ్రామాలకు చెందిన ఐదుగురు శనివారం అర్ధరాత్రి ఆత్మకూరులో ఓ కారును తీసుకొని అనంతపురం వైపు వెళ్లారు. పంపనూరు సమీపంలోకి వెళ్లగానే రోడ్డుపై వెళ్తున్న కొరియర్లు (పార్సిళ్లు) తీసుకెళ్లే వాహనాన్ని అడ్డుకొని అతనిపై దాడి చేసి రూ.20 వేలు లాక్కున్నట్లు తెలుస్తోంది. అనంతరం అనంతపురం నుంచి కళ్యాణదుర్గం మండలం మానిరేవు గ్రామానికి చెందిన ఓబులేసు అనే వ్యక్తి టమాటాలతో బోలెరోలో వస్తుండగా అతడిని రోడ్డు మధ్యలో ఆపి దాడి చేసి అతని దగ్గర ఉన్న సెల్‌ఫోన్‌ను, బొలెరాను తీసుకున్నారు. ఓబులేసు ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ పంపనూరులోకి పరుగులు తీసి స్థానికుల సహాయం కోరాడు. అనంతరం దొంగలు వై.కొత్తపల్లి సమీపంలోని కొత్తపల్లికి చెందిన కొండన్న అనే వ్యక్తికి చెందిన గొర్రెల షెడ్‌ పొలంలో ఉండగా దొంగలించిన బోలెరా వాహనంలో గొర్రెల దొంగతనానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అయితే గొర్రెలకు కాపలాగా ఉన్న వ్యక్తి ఆ దొంగలకు ఎదురుతిరిగి గొర్రెలను దొంగతనం చేయకుండా అడ్డుపడగా అతనిపై దొంగలు రాళ్లు విసిరినట్లు బాధితులు చెబుతున్నారు. స్థానికులకు సమాచారం ఇవ్వగా పక్కనే ఉన్న గొర్రెల కాపర్లు కేకలు వేస్తూ వచ్చే సరికి దొంగలు పారిపోయారు. దీంతో గొర్రెల కాపర్లు, బొలెరో బాధితుడు, కొరియన్‌ వాహన డ్రైవర్‌ ఆదివారం ఉదయాన్నే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

పోలీసుల అదుపులో దొంగలు?

విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే గాలించగా ముగ్గురు దొంగలు దొరికినట్లు తెలుస్తోంది. మిగిలిన ఇద్దరు పరారీలో ఉన్నట్లు సమాచారం. అలాగే దొంగిలించిన బొలేరో వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకుని పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చా రు. పోలీసులు ఆ ముగ్గురిని విచారిస్తున్నట్లు తెలుస్తోంది.

భయం భయంగా ప్రజలు..

ఆత్మకూరులో పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో అమర్‌నాథ్‌ అనే మెకానిక్‌ షాపులో రెండుసార్లు దొంగతనం జరిగింది. గత నెల 31న రూ.లక్ష పైగా విలువ చేసే వైరును దొంగలించారు. ఈ నెల మెదటి వారంలో గాలిమరల కంపెనీలో పెద్ద ఎత్తున వైర్‌ చోరీకి గురైంది. దీని విలువ రూ.లక్షల్లో ఉందంటూ కంపెనీ యజమానులు ఫిర్యాదు చేశారు. గత మూడు రోజుల క్రితం ఆత్మకూరుకు చెందిన కొంత మంది రైతులకు సంబంధించి కేబుల్‌ వైర్లు దొంగతనాలు జరిగాయి. వరుస దొంగతనాలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement