అనంతపురం: సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (సీయూఏపీ) సరికొత్త కోర్సులను అమలు చేస్తోంది. 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎమ్మెస్సీ (కెమిస్ట్రీ), ఎమ్మెస్సీ (జెనోమిక్ సైన్సెస్), ఎంసీఏ కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. ఇది వరకే బీటెక్ (సీఎస్‌ఈ) ప్రవేశపెట్టారు. కొత్తగా అమలు చేస్తున్న జెనోమిక్ సైన్సెస్, కెమిస్ట్రీ, ఎంసీఏ కోర్సుల్లో ఒక్కొక్క ప్రోగ్రాంకు 15 సీట్లు భర్తీ చేస్తున్నారు. ఇప్పటికే 8 యూజీ కోర్సులను యూనివర్సిటీ అందిస్తోంది. బీటెక్ (సీఎస్‌ఈ), బీఎస్సీ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్), బీఏ (పొలిటికల్ సైన్సెస్, అండ్ ఇంగ్లిష్), బీఎస్సీ (సైకాలజీ), బీకాం, బీబీఏ, బీఎస్సీ (రిటైల్ మేనేజ్‌మెంట్) కోర్సులు ఉన్నాయి. పీజీలో 17 కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఎమ్మెస్సీ (స్పేస్ టెక్నాలజీ), మేథమేటిక్స్, అండ్ కంప్యూటింగ్ సైన్సెస్, ఎకనామిక్స్, ఎంఏ ఇంగ్లిష్, పొలిటికల్ సైన్సెస్, హిందీ, తెలుగు, ఎంబీఏ, ఎంకాం ప్రోగాంలు ఉన్నాయి.
ప్రతిభావంతులకు ఫీజు మినహాయింపు..
ప్రతి ప్రోగ్రామ్‌లో అత్యుత్తమ పనితీరు కనబరిచే విద్యార్థికి కోర్సు ఫీజులో 20 శాతం రాయితీ ఇవ్వనున్నారు. డిజిటల్ కోర్సుల్లో మెరుగైన అభ్యసనం చేయడానికి వీలుగా అత్యాధునిక నెక్ట్స్ జెన్ మీడియా స్టూడియో, నెక్ట్స్ జెన్ డేటా సెంటర్ ఏర్పాటు చేశారు. జాతీయ డిజిటల్ విద్యా లక్ష్యానికి అనుగుణంగా హై క్వాలిటీ కంటెంట్, ఆన్‌లైన్ కోర్సులు, పాడ్‌కాస్ట్ రూపొందించడానికి ఈ స్టూడియో దోహదపడనుంది. కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్), ఆర్థిక అవగాహన, సమాచార విశ్లేషణ, అకడమిక్ రచన, ఇతర సమకాలీన అంశాలకు సంబంధించి వృత్తిపరమైన అంశాలతో అనుసంధానమయ్యేలా అవకాశాలను కల్పించారు. సెంట్రల్ యూనివర్సిటీలో దేశ వ్యాప్తంగా 17 రాష్ట్రాల విద్యార్థులు అడ్మిషన్లు తీసుకున్నారు. జాతీయస్థాయి నైపుణ్యం గల కోర్సులను ప్రవేశపెట్టి.. ఉద్యోగ కల్పనకు శ్రీకారం చుట్టినట్టు వీసీ ప్రొఫెసర్ ఎస్‌ఏ కోరి తెలిపారు.
2026–27 విద్యా సంవత్సరంలో కొత్తగా మూడు కోర్సులు
ఎమ్మెస్సీ రసాయన శాస్త్రం,
జినోమిక్ సైన్సెస్ బ్రాంచ్‌లు
ఎంసీఏ కోర్సు తాజాగా అమలు


