తాగిస్తారు.. తాట తీస్తారు! | - | Sakshi
Sakshi News home page

తాగిస్తారు.. తాట తీస్తారు!

Jul 18 2026 9:51 AM | Updated on Jul 18 2026 9:51 AM

సాక్షి, పుట్టపర్తి

మందుబాబును సర్కార్‌ నిలువుదోపిడీ చేస్తోంది. ఊరూరా వైన్‌షాపు...వీధికో బెల్ట్‌షాపుతో 24 గంటలూ మద్యాన్ని అందుబాటులో ఉంచిన జనంతో తాగిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం..తాగి రోడ్డెక్కిన మందుబాబులను జరిమానాతో లూటీ చేస్తోంది. మద్యం విక్రయాలకు టార్గెట్‌ విధించిన సీఎం చంద్రబాబు...డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులనూ టార్గెట్‌ విధించారు. దీంతో సాయంత్రమైతే చాలు పోలీసులు స్టేషన్లు వదిలి రోడ్లపైకి వస్తున్నారు. సుక్కేసుకుని బండెక్కిన వారికి సుక్కలు చూపుతున్నారు. అలాగే సబ్‌ డివిజన్‌కు ఓ డ్రోన్‌ చొప్పున ఎగరేస్తున్నారు. అదేవిధంగా నైట్‌ విజన్‌ డ్రోన్లతో బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగే వారిని పట్టేస్తున్నారు. గతంలో కేవలం జరిమానాతో వదిలిపెట్టేవారు. ఇప్పుడు కోర్టులో ప్రవేశపెడుతున్నారు.

‘మత్తు’లో బండెక్కి బుక్‌ అవుతున్నారు..

ఊరూరా మద్యం షాపులు.. వీధివీధినా బెల్టుషాపుల ఏర్పాటుతో ఊళ్లకు ఊళ్లే మత్తులో జోగుతుండగా...రాష్ట్ర ఖజానాకు చేరే సొమ్ము భారీగా పెరిగింది. దీంతో మద్యం అమ్మకాలు పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు బహిరంగంగానే ఆదేశాలిస్తున్నారు. అంతేకాకుండా టార్గెట్లు ఇస్తున్నారు. లక్ష్యం చేరుకునే క్రమంలో మద్యం దుకాణాల నిర్వాహకులు బెల్టు షాపులపై ఆధారపడ్డారు. రాత్రింబవళ్లు తేడా లేకుండా.. గుడి, బడి అనే సంగతి మరిచి మద్యం విక్రయిస్తున్నారు. దీంతో ఏ గ్రామంలో చూసినా మద్యం తాగే వారి సంఖ్య పెరిగిపోయింది. చాలా మంది బహిరంగ ప్రదేశాల్లోనే మద్యం తాగి బైక్‌లపై రయ్యిమంటూ దూసుకెళ్తున్నారు. ఇదే సమయంలో పోలీసుల తనిఖీల్లో దొరికిపోతున్నారు. మద్యం తాగి వాహనాలు నడిపే వారికి కనీసంగా రూ.10 వేలు జరిమానా విధిస్తుండగా..సర్కార్‌ ఖజానాకు చేరే సొమ్ము డబుల్‌ అవుతోంది. కూలి పనులు చేసుకుని ఇంటిదారిన పట్టిన దినసరి కూలి దారిలో కనిపించిన బెల్ట్‌షాపులో మద్యం తాగి పోలీసులకు చిక్కి నెలరోజుల శ్రమను జరిమానా రూపంలో చెల్లించుకుంటున్నాడు.

ఊదితే 200 దాటిపోతోంది..

ట్రాఫిక్‌ నిబంధనల ప్రకారం మానవ శరీరంలో ఉండే వంద మిల్లీలీటర్ల రక్తంలో 35 శాతం వరకు ఆల్కహాల్‌ ఉండవచ్చు. పోలీసులు నిర్వహించే బ్రీత్‌ ఎనలైజర్‌ పరీక్షలో అంతకంటే ఎక్కువ ఆల్కహాల్‌ శాతం ఉంటే కేసు నమోదు చేయవచ్చు. ఇటీవల చేపట్టిన డ్రంకెన్‌ డ్రైవ్‌ పరీక్షల్లో 150 శాతం నుంచి 200 శాతం వరకు ఆల్కహాల్‌ నమోదు కావడం చూసి పోలీసులే బిత్తరపోతున్నారు. ‘‘ఎంత తాగినావ్‌ నాయనా’’ అంటూ బుద్ధి చెబుతున్నారు.

ఊరారా వైన్స్‌.. వీధికో బెల్ట్‌షాపు

తాగి ఊగుతూ వాహనాలతో

రోడ్డెక్కుతున్న మందుబాబులు

డ్రంకన్‌ డ్రైవ్‌ తనిఖీలు ముమ్మరం

చేసిన పోలీసులు

దొరికిపోతే రూ.10 వేలకుపైగా

జరిమానా, జైలు శిక్ష

మద్యంతో చిత్తయిపోతున్న

మందుబాబులు

హత్య నేరం కింద కేసు నమోదు..

ఈనెల 11వ తేదీన పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలో పోలీసులు ముమ్మర తనిఖీలు చేసి బహిరంగంగా మద్యం సేవిస్తున్న 31 మందిని అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో హాజరు పరచగా.. జడ్జి ఒక్కొక్కరికి రూ.వెయ్యి చొప్పున జరిమానా విధించారు. అదే రోజున మద్యం సేవించి వాహనం నడుపుతూ మరో నలుగురు పట్టుబడ్డారు. వారందరినీ కోర్టు ముందు హాజరు పరచగా ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున కోర్టు జరిమానా విధించింది.

జూన్‌ 12వ తేదీన కనగాపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా.. మద్యం సేవించిన ఓ యువకుడు బైక్‌పై వస్తూ పట్టుబడ్డాడు. కేసు నమోదు చేసి ధర్మవరం కోర్టులో హాజరు పరచగా.. జడ్జి రూ.10 వేల జరిమానా విధించారు.

మే 21వ తేదీన హిందూపురం టూ టౌన్‌ పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా.. మద్యం సేవించిన ఓ వ్యక్తి తుపాన్‌ వాహనం నడుపుతూ పట్టుబడ్డాడు. కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచగా.. జడ్జి రూ.10 వేల జరిమానా విధించారు. అదే రోజు లేపాక్షి సమీపంలో తనిఖీలు చేస్తుండగా.. మద్యం సేవించి వాహనం నడుపుతూ నలుగురు పోలీసులకు పట్టుబడ్డారు. మేజిస్ట్రేట్‌ ముందు హాజరు పరచగా.. ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున జరిమానా విధించారు.

మద్యం తాగి వాహనాలు నడపడం నేరం. దీనివల్ల మద్యం తాగిన వ్యక్తితో పాటు ఒక్కోసారి ఎదురుగా వచ్చే వాహనదారుడూ ప్రమాదాల బారిన పడే ప్రమాదం ఉంది. అందుకే డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు ముమ్మరం చేశాం. మద్యం సేవించిన వ్యక్తి వాహనం నడిపితే హత్యా నేరం కింద నాన్‌ బెయిలబుల్‌ కేసు నమోదు చేస్తాం. నిందితులకు కఠిన శిక్ష పడుతుంది. ప్రమాదం జరిగి ఎదుటి వారు మరణిస్తే డ్రైవర్‌పై హత్యా నేరానికి సమానమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తాం.

– ఎస్‌.సతీష్‌కుమార్‌, ఎస్పీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement