ఆరంభం నుంచి అంతే.. | - | Sakshi
Sakshi News home page

ఆరంభం నుంచి అంతే..

Jul 15 2026 5:15 AM | Updated on Jul 15 2026 5:15 AM

సాక్షి, పుట్టపర్తి: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా కూటమి నాయకుల మధ్య కుంపట్లు రగులుతూనే ఉన్నాయి. జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ నాయకుల మధ్య సఖ్యత కరువైంది. మూడు పార్టీల నాయకులు ఏదో ఒక విషయంలో రచ్చకెక్కుతున్నారు.

అవినీతి, అక్రమాల్లో పోటీ

ధర్మవరం నియోజకవర్గంలో మూడు పార్టీల నాయకుల మధ్య అవినీతి, అక్రమాల్లో పోటీ నెలకొంది. ఎవరికి వారుగా అధికారులపై పెత్తనం చెలాయిస్తున్నారు. స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్లు, మట్టి మాఫియా, ఇసుక దందా, లిక్కర్‌ సిండికేటు.. ఇలా ఒక్కో వర్గం తమదైన శైలిలో దందాలకు పాల్పడుతోంది. మూడు పార్టీల నాయకుల పెత్తనంతో నియోజకవర్గానికి వచ్చేందుకు అధికారులు వెనుకడుగు వేస్తున్నారు. దీంతో ధర్మవరం నియోజకవర్గ వ్యాప్తంగా శాంతి భద్రతలు లోపించాయి. నిత్యం చోరీలు, సైబర్‌ నేరాలు, అధిక వడ్డీ ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ప్రతి మండలంలో మూడు పార్టీల నాయకుల మధ్య చిచ్చు రగులుతోంది. పరిష్కరించే పెద్దలు కరువయ్యారు.

పదవులన్నీ వారికేనా?

జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే కంటే షాడో ఎమ్మెల్యే పెత్తనం ఎక్కువగా ఉంటోంది. మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. టీడీపీలో ఏళ్లుగా కష్టపడిన వారిని పట్టించుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కొందరు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. రానున్న రోజుల్లో మరింత మంది టీడీపీ వీడే పరిస్థితి కనిపిస్తోంది. నల్లమాడ మార్కెట్‌ యార్డు (కొత్తచెరువు) చైర్మన్‌ పదవిని జనసేనకు కట్టబెట్టారు. పుడా (పుట్టపర్తి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ) చైర్మన్‌ పదవి ఇప్పటి వరకు ఎవరికీ ఇవ్వలేదు. పుడా చైర్మన్‌ పదవికి టీడీపీ నుంచి ఎక్కువ మంది రేసులో ఉండటంలో బీజేపీకి అప్పజెబుతారన్న ప్రచారం జరుగుతోంది. జెండా కూలీలుగా తామెన్నాళ్లిలా షాడో ఎమ్మెల్యే వెంట తిరగాలని దూరంగా ఉంటున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది.

‘పురం’.. పీఏల పరం

హిందూపురంలో నాలుగు దశాబ్దాలుగా నందమూరి కుటుంబ సభ్యులకు పట్టం కడుతున్నప్పటికీ ప్రత్యేక మార్కు కనిపించలేదు. ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రజల ఓట్లతో గెలిచి.. సినిమా షూటింగుల్లో బిజీగా ఉంటారు. దీంతో స్థానికంగా ఉంటే టీడీపీ నాయకుల పెత్తనం ఎక్కువైంది. ఒకరు ఉండాల్సిన ‘పీఏ’ స్థానంలో నలుగురు ఉంటూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్యే బాలకృష్ణ చుట్టపుచూపుగా వచ్చి వెళ్తుంటారు. పర్యవేక్షణ లేకపోవడంతో హిందూపురంలో ఆయన అనుచరులు వసూళ్ల పర్వానికి తెరలేపారు. ప్రతి పనికీ రేటు ఫిక్స్‌ చేసి వసూలు చేస్తున్నారన్న విమర్శలున్నాయి.

నాలుగు పదవులపై గుస్సా..

మడకశిర నియోజకవర్గంలో బలమైన స్థానిక నేతలు ఎందరో ఉన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి పని చేస్తున్న వారందరినీ పక్కనబెట్టి.. స్థానికేతరుడైన ఎంఎస్‌ రాజుకు పట్టం కట్టారన్న విమర్శలున్నాయి. ఇదే అదునుగా నిత్యం వివాదాల్లోకి నిలుస్తూ అధిష్టానం వద్ద ఎక్కువ మార్కులు తెచ్చుకుని పదవులు పొందుతున్నారని చెబుతున్నారు. ఒకే వ్యక్తికి నాలుగు పదవులు ఎలా ఇస్తారని జిల్లా వ్యాప్తంగా నాయకులందరూ డైలమాలో పడ్డారు. ఎమ్మెల్యే పదవితో పాటు టీటీడీ బోర్డు మెంబర్‌ , జిల్లా అధ్యక్ష పదవి, ఓ అనుబంధ విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగిస్తుండటంపై అసమ్మతి కుంపటి రగులుతూనే ఉంది. ఆయన వ్యవహార శైలిపై మడకశిర వ్యాప్తంగా జోరుగా చర్చ జరుగుతోంది.

నేతల మధ్య నేటికీ సఖ్యత కరువు

కదిరిలో ఎమ్మెల్యే కందికుంటపై బీజేపీ నేత విష్ణు ఫిర్యాదు

పెనుకొండ ఏళ్లుగా తెగని ఆధిపత్య పోరు

‘పురం’లో బాలకృష్ణ అనుచరులదే పెత్తనం

పుట్టపర్తిలో తారస్థాయికి అసమ్మతి

ధర్మవరంలో మూడు పార్టీల మధ్య తగాదాలు

మడకశిరలో నాలుగు పదవులపై అసంతృప్తులు

ఏళ్లుగా తెగని పంచాయితీ

పెనుకొండలో మంత్రి సవిత, ఎంపీ పార్థసారథి వర్గాల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. కొన్నేళ్లుగా ఇరు వర్గాల మధ్య పంచాయితీ తెగడమేలేదు. పార్టీ అధిష్టానం ఆదేశించినా పరిష్కారం మాత్రం కాలేదు. మంత్రి హోదాలో సవిత అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. అయితే తాను అంతకుముందు పెనుకొండకు ఎమ్మెల్యేనని.. హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి మరో వర్గాన్ని ప్రతిసారీ తెరపైకి తెస్తున్నారు. పార్లమెంటు సభ్యుడు అయినప్పటికీ నిత్యం పెనుకొండ నియోజకవర్గంలోనే పెత్తనం చెలాయించడమేంటని మరో వర్గం నేతలు గుర్రుగా ఉన్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది.

కదిరి నియోజకవర్గంలో ఆరంభం నుంచి టీడీపీ వర్సెస్‌ బీజేపీ మధ్య గొడవలు రచ్చకెక్కుతూనే ఉన్నాయి. తాజాగా టీడీపీ కార్యకర్తల మధ్య గ్రూపు తగాదాలు ఏర్పడ్డాయి. రెండు రోజుల క్రితం ‘తెలుగు తమ్ముళ్లు’ తన్నుకున్న సంగతి తెలిసిందే. ఆధిపత్య పోరులో భాగంగా ముష్టియుద్ధానికి దిగారు. మరోవైపు టీడీపీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ చేస్తున్న అక్రమాలపై విచారణ చేయించాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి పలుమార్లు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖలో భారీ అక్రమాలు జరిగాయంటున్నారు. ఎమ్మెల్యే కుందికుంట స్థానికంగా ఉంటూ అన్ని వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ బీజేపీ, జనసేన నాయకులందరినీ దూరం పెట్టేశారు. కూటమి ధర్మానికి తూట్లు పొడుస్తున్నారని ఆయా పార్టీల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement