అమడగూరు/ఓడీచెరువు/కదిరి టౌన్/కదిరి అర్బన్/తలుపుల: రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యుడు లక్ష్మిరెడ్డి మంగళవారం జిల్లాలో సుడిగాలి పర్యటన చేశారు. అమడగూరు మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఆదర్శ పాఠశాలలను తనిఖీ చేసి మధ్యాహ్న భోజనంలో మెనూ పాటించకపోవడంతో పాటు విద్యార్థులకు రుచీ పచీ లేని భోజనం వడ్డించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ ఇంట్లో కూడ ఇలాగే చేస్తారా అంటూ నిర్వాహకులు, ఉపాధ్యాయులపై అసహనం వ్యక్తం చేశారు. అలాగే స్టోర్ రూముల్లో నాణ్యతలేని, కలరింగ్ ముద్రలేని కోడిగుడ్ల ఉండటంపై మండిపడ్డారు. 50 గ్రాములు ఉండాల్సిన ఒక కోడిగుడ్డు ... కేవలం 25 గ్రాములే ఉండటమేంటని ప్రశ్నించారు. ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ శిరీషాబాయి, ఎంఈఓ సంపూర్ణ, పాఠశాల ప్రదానోపాధ్యాయుడు రమణారెడ్డిలకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం తలుపుల కేజీబీవీ స్కూల్‌ను లక్ష్మిరెడ్డి తనిఖీ చేసి మెనూ ప్రకారం పౌష్టికాహారంపై ఆరా తీశారు. నాణ్యతలో తేడా ఉంటే నాణ్యమైన సరుకులు తెప్పించుకోవాలన్నారు. తర్వాత కదిరి మున్సిపల్ పరిధిలోని డిగ్రీ కళాశాల సమీపంలో ఉన్న ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలను రాష్ట్ర ఫుడ్ కమిషన్ మెంబర్ లక్ష్మీరెడ్డి తనిఖీ చేశారు. మెనూ సరిగా పాటించని వార్డెన్‌కు మెమో జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కుటాగుళ్ల సమీపంలోని శాంతినికేతన స్కూల్ వద్ద ఉన్న స్టాక్ పాయింట్‌ను పరిశీలించారు. అలాగే ఓడీచెరువు మోడల్ అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పౌష్టికాహార నాణ్యత, రికార్డులను పరిశీలించారు. అంగన్‌వాడీ సెంటర్ సిబ్బంది పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. లబ్ధిదారులకు పంపిణీ చేయాల్సిన కోడిగుడ్లకు ఉండాల్సిన ముద్ర లేకపోవడం, కోడిగుడ్ల బరువు, నాణ్యత కూడ ప్రమాణాల ప్రకారం లేవని అసహనం వ్యక్తం చేశారు. నాణ్యత ప్రమాణాలు పాటించని వారిపై తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. సీడీపీఓతో పాటు అంగన్‌వాడీ టీచర్, కాంట్రాక్టర్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేయాలన్నారు.
మెనూ లేదు... గోళీ సైజులో గుడ్లు
నిర్వాహకులపై రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యుడి ఆగ్రహం
పలువురికి షోకాజ్ నోటీసులు


