‘సర్‌’ ప్రక్రియ 24 వరకూ పొడిగింపు | - | Sakshi
Sakshi News home page

‘సర్‌’ ప్రక్రియ 24 వరకూ పొడిగింపు

Jul 15 2026 5:15 AM | Updated on Jul 15 2026 5:15 AM

కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌

ప్రశాంతి నిలయం: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని ఈనెల 24 వరకూ ఎన్నికల కమిషన్‌ పొడిగించినట్లు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లాలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో పనిచేస్తున్న సిబ్బందికి తగిన ఆదేశాలు జారీ చేశామన్నారు. పొడిగించిన తేదీని దృష్టిలో పెట్టుకొని ప్రజలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

షెడ్యూల్‌ ఇలా...

బీఎల్‌ఓల ఇంటింటి సందర్శన, పోలింగ్‌ కేంద్రాల హేతుబద్దీకరణకు ఈనెల 24 వరకూ గడువు ఉందన్నారు. 31న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ, జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకూ క్లెయిమ్‌, అభ్యంతరాల దాఖలుకు అవకాశం ఉందన్నారు. అలాగే 31 నుంచి సెప్టెంబర్‌ 28 వరకూ నోటీసు దశ, క్లెయిమ్‌, అభ్యంతరాల పరిష్కారానికి సమయమిచ్చారన్నారు. అక్టోబర్‌ 3వ తేదీన తుది ఓటరు జాబితా ప్రచురిస్తారన్నారు.

నాగలగుబ్బలో

ఎలుగు సంచారం

ముదిగుబ్బ: మండలంలోని నాగలగుబ్బ గ్రామ సమీపంలో ఎలుగుబంటి సంచరిస్తుండడంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎలుగుబంటి పలుమార్లు కనిపించడంతో వ్యవసాయ పనులకు పొలాలకు వెళ్లేందుకు రైతులు బెంబేలెత్తిపోతున్నారు. అటవీశాఖ అధికారులు స్పందించి ఎలుగుబంటి సంచారాన్ని గుర్తించి అడవుల్లోకి తరిమేయాలని కోరుతున్నారు.

16 ఏళ్ల నిరీక్షణకు తెర

11 మంది 2008 డీఎస్సీ అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు అందజేత

అనంతపురం ఎడ్యుకేషన్‌: దాదాపు 16 ఏళ్ల నిరీక్షణ తర్వాత డీఎస్సీ–2008కు ఎంపికైన 11 మంది అభ్యర్థులకు మంగళవారం డీఈఓ శ్రీనివాసరావు నియామక ఉత్తర్వులు అందజేశారు. డీఎస్సీ–2008 నోటిఫికేషన్‌కు సంబంధించి 2010లో నియామకాలు చేపట్టారు. అయితే కొన్ని కారణాల వల్ల 2011లో కొందరి నియామకాలు రద్దయ్యాయి. దీంతో బాధిత అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ కేసులో అభ్యర్థులకు అనుకూలంగా కోర్టు తీర్పు రావడంతో వారిని తిరిగి నియమించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన 11 మంది అభ్యర్థులకు మంగళవారం డీఈఓ కార్యాలయంలో నియామక ఉత్తర్వులు అందజేశారు. వీరందరూ ఎస్జీటీ తెలుగు ఉపాధ్యాయులే కావడం గమనార్హం. కోర్టు తీర్పు, ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నియామక ప్రక్రియ పూర్తి చేసినట్లు డీఈఓ శ్రీనివాసరావు తెలిపారు.

సాంకేతిక నైపుణ్యం ఉంటేనే ఉద్యోగాలు

కదిరి అర్బన్‌: మున్సిపల్‌ పరిధిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో మంగళవారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై డిస్ట్రిక్ట్‌ ఎంప్లాయియ్‌మెంట్‌ ఆఫీసర్‌ కళ్యాణి, జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి హరిక్రిష్ణ, కదిరి ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ భాస్కర్‌ విద్యార్థులకు అవగాహన కల్పించారు. గ్రూప్స్‌, యూపీపీఎస్‌సీ, ఏపీపీఎస్‌సీ, ఎస్‌ఎస్‌సీ, రైల్వే, బ్యాంకింగ్‌ తదితర ఉద్యోగాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రోజుల్లో డిగ్రీ మాత్రమే ఉంటే సరిపోదని, సాంకేతిక నైపుణ్యం ఉంటేనే ఉద్యోగాలు వస్తాయన్నారు. కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, కంప్యూటర్‌ పరిజ్ఙానం తప్పనిసరిగా ఉండాలని సూచించారు. అలాగే కదిరి ఎస్టీఎస్‌ఎన్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద స్టడీ సర్కిల్‌ను వినియోగించుకోవాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement