బత్తలపల్లి: తీవ్ర వర్షాభావ పరిస్థితులు తొలగిపోయి, రైతుల కష్టాలు తీర్చాలంటూ ఐదు గ్రామాల ప్రజలు కాటికోటేశ్వరస్వామిని భక్తిశ్రద్ధలతో వేడుకున్నారు. మండలంలోని యర్రాయపల్లి, లింగారెడ్డిపల్లి, అనంతసాగరం, వెంకటగారిపల్లి, రాఘవంపల్లి గ్రామాల్లో ఈదుల ముష్టూరు కాటికోటేశ్వరస్వామి ఉత్సవ విగ్రహాన్ని పల్లకీలో ఉంచి ఊరేగించారు. భజన బృందాల కీర్తనలు, శివనామస్మరణతో గ్రామ వీధులు మార్మోగాయి. ఐదు గ్రామాల భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామికి మొక్కలు చెల్లించుకున్నారు. వర్షాలు లేక భూములు ఎండిపోతున్న తరుణంలో రైతులకు ఉపశమనం కలగాలని, చెరువులు, కుంటలు నీటితో నిండాలని, పంట పొలాలు పచ్చదనంతో కళకళలాడాలని భక్తులు స్వామిని వేడుకున్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అలాగే మండలంలోని కోడేకండ్ల గ్రామంలో పెద్దమ్మకు వర్షం కోసం 101 బిందెలు నీళ్లు పోసి మొక్కులు చెల్లించారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పూజలు చేశారు.


