రాప్తాడు రోడ్లు అధ్వానం
రోడ్లు అస్తవ్యస్తం..
కనగానపల్లి/రామగిరి: రాప్తాడు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో గ్రామీణ రహదారులు అస్తవ్యస్తంగా ఉన్నాయి. దీంతో ఈ రోడ్ల గుండా ప్రయాణించలేక గ్రామీణులు అవస్థలు పడుతున్నారు. కనగానపల్లి, రామగిరి, రాప్తాడు, చెన్నేకొత్తపల్లి మండలాల్లో పలు రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి. అధికార టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు రహదారుల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని చెబుతున్నా క్షేత్రస్థాయిలో కనిపించడం లేదు.
గుంతలమయంగా రహదారులు:
కనగానపల్లి మండలంలోని కనగానపల్లి– మామిళ్లపల్లి ప్రధాన రహదారితో పాటు కనగానపల్లి– ముత్తువకుంట్ల, యలకుంట్ల– కనగానపల్లి, యలకుంట్ల– బద్దలాపురం రహదారులు గుంతలమయంగా ఉన్నాయి. యలకుంట్లకు వెళ్లే రహదారి గుంతలు పడి, రాళ్లు తేలి చాలా అధ్వానంగా తయారైంది. ఈ రహదారి గుండా పోవాలంటే వాహనదారులు చాలా ఇక్కట్లు పడుతున్నారు. రహదారిలో పడిన గుంతల్లో మట్టి కూడా వేయకపోవడంతో వాహదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. కనగానపల్లి నుంచి యలకుంట్లకు 4 కి.మీ. దూరం లేకున్నా గుంతలు పడిన రహదారి గుండా ద్విచక్ర వాహనంలో వెళ్లాలంటే అర గంటకుపైగా సమయం పడుతోందని స్థానిక గ్రామస్తులు కృష్ణారెడ్డి, వెంకటరాముడు, నారాయణప్ప, చెన్నారెడ్డి తెలిపారు. యలకుంట్ల నుంచి బద్దలాపురం వైపు వెళ్లాలన్నా ఇదే పరిస్థితి ఉందని వారు తెలిపారు. కనగానపల్లి నుంచి మామిళ్లపల్లి వెళ్లే రహదారిలో కూడా పలుచోట్ల రోడ్డు దెబ్బతినింది. రెండు మార్లు తూతూ మంత్రంగా మరమ్మతు పనులు చేయించినా ఫలితం లేదని వాహనదారులు చెపుతున్నారు.
రామగిరి రహదారులు మరీ అధ్వానం..
రామగిరి మండలం పెనుబోలు, కలికివాండ్లపల్లి, గంతిమర్రి గ్రామాలు నేషనల్ హైవేకు కేవలం కిలో మీటరు దూరంలో ఉన్నా సరైన రోడ్డు సదుపాయం లేక ఆయా గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికల సమయంలో ఓట్లకోసం గ్రామాల్లో కలియతిరిగి, అధికారంలోకొచ్చిన వెంటనే గ్రామీణ రోడ్ల నిర్మాణాన్ని విస్మరించారని శివారెడ్డి, రమేష్‌రెడ్డి, సంతోష్, గోపాల్‌రెడ్డి, రామాంజి, రాజశేఖర్, మల్లారెడ్డి, సిద్దారెడ్డి, మారుతీరెడ్డి, రాజేంద్ర, వారాధి, రామకృష్ణారెడ్డి, చెన్నకేశవరెడ్డి, నరసింహ, రవి, నాగరాజు తదితరులు తెలిపారు.


