క్షుద్ర పూజల కలకలం | - | Sakshi
Sakshi News home page

క్షుద్ర పూజల కలకలం

Jul 15 2026 5:15 AM | Updated on Jul 15 2026 5:15 AM

నల్లచెరువు: మండలంలోని చిన్నయల్లంపల్లిలో మంగళవారం క్షుద్ర పూజలు కలకలం రేగాయి. మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు చిన్నయల్లంపల్లికి చెందిన సాతర్ల మోహన్‌కుమార్‌ ఇంటి ప్రహరీలోపల క్షుద్ర పూజలు ( పసుపు, కుంకుమ, అక్షింతలు, నిమ్మకాయలు, వేపాకు, నల్లేరు, జొన్నలు ) చేసినట్లు ఇంటి యజమాని గుర్తించాడు. అమావాస్య కావడంతో క్షుద్రపూజలు చేసి ఉంటారని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంటి యజమాని మోహన్‌కుమార్‌ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

విద్యుదాఘాతంతో యువకుడి మృతి

పరిగి: మండలంలోని మోదా పంచాయతీ పరిధి పుట్టగూర్లపల్లిలో విద్యుదాఘాతంతో చంద్రశేఖర్‌ (31) మృతిచెందాడు. గ్రామానికి చెందిన ఉప్పర అశ్వర్థప్ప కుమారుడు చంద్రశేఖర్‌ వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో పొలంలోని విద్యుత్‌ కనెక్షన్‌కు ఉన్న మోటారు పంపు సెట్‌ స్టార్టర్‌ వద్దకు వెళ్లి ఆన్‌ చేస్తుండగా విద్యుత్‌ షాక్‌కు గురయ్యాడు. అక్కడే కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు గమనించి చికిత్స నిమిత్తం హిందూపురం ప్రభుత్వాస్పత్రికరి తరలించారు. వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి భార్య వనజ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నల్లు ఎస్‌ఐ రవికుమార్‌ తెలిపారు.

కదిరి టౌన్‌ సీఐగా

వెంకటేశ్వర్లు

కదిరి: పట్టణ సీఐ డీవీ నారాయణరెడ్డి తాడిపత్రి అప్‌గ్రేడ్‌ పోలీస్‌ స్టేషన్‌కు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఇక్కడికి పుట్టపర్తి ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్‌గా ఉన్న బి.వెంకటేశ్వర్లును నియమించారు. ఈ మేరకు జిల్లా ఎస్‌పీ సతీష్‌కుమార్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. నారాయణరెడ్డికి గతంలో కూడా తాడిపత్రిలో పని చేసిన అనుభవం ఉంది. మళ్లీ అక్కడికే బదిలీ కావడం వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నట్లు తెలుస్తోంది.

టీబీ డ్యాంకు

తగ్గుతున్న ఇన్‌ఫ్లో

బొమ్మనహాళ్‌: ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి రిజర్వాయర్‌ అనంతపురం జిల్లా ప్రాంత ప్రజలకు వరప్రధాయిని తుంగభద్ర జలాశయానికి ఇన్‌ఫ్లో తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం మంగళవారం డ్యాంలో నీటి నిల్వ 25.13 టీఎంసీలకు చేరింది. డ్యాం ఎగువ భాగంలోని శివమొగ్గ, తీర్ధనహళ్లి, చిక్కమంగళూరు, వరనాడు, శృంగేరి తదితర ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో డ్యాం ఇన్‌ఫ్లో క్రమంగా తగ్గుతున్నట్లు టీబీ బోర్డు అధికారులు తెలిపారు. తుంగభద్ర రిజర్వాయర్‌ పూర్తి సామర్థ్యం 1633 అడుగులకు గాను గురువారం 1602.64 అడుగల మేర నీటిమట్టం ఉంది. డ్యాం నీటి నిల్వ పూర్తి సామర్థ్యం 105.788 టీఎంసీలకు గాను 25.13 టీంఎసీల నీరు నిల్వ ఉంది. ఇన్‌ఫ్లో 9,982 క్యూసెక్కులుండగా 803 క్యూసెక్కులు అవుట్‌ఫ్లో ఉంది. గతేడాది ఇదే సమయానికి డ్యాంలో 1625.49 అడుగులతో 78.11 టీఎంసీల నీరు నిల్వ ఉండి 43,223 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 36,345 క్యూసక్కుల నీటిని గేట్లు ఎత్తి నదికి వదిలేవారు.

పరీక్షల ఫలితాల విడుదల

అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహించిన బీఈడీ, బీపీఈడీ ఆరో సెమిస్టర్‌ ఫలితాలను మంగళవారం వీసీ ప్రొఫెసర్‌ ఎన్‌వీఆర్‌ జ్యోతి కుమార్‌ విడుదల చేశారు. బీఈడీ కోర్సులో మొత్తం 727 మంది పరీక్ష రాయగా 688 మంది (94.64 శాతం), బీపీఈడీ కోర్సులో 54 మంది రాయగా 50 (92.59 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ నెల 30వ తేదీలోపు రీవాల్యుయేషన్‌, పర్సనల్‌ ఐడెంటిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కార్యక్రమంలో ఎవాల్యుయేషన్స్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ ఎంవీ లక్ష్మయ్య, కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ శ్రీరాములు నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement