అనంతపురం న్యూటౌన్: ‘స్వచ్చాంధ్ర–స్వర్ణాంధ్ర’ లక్ష్య సాధనలో పురోగతి సాధించినందుకు ఉమ్మడి అనంతపురం జిల్లాకు రెండు రాష్ట్ర స్థాయి పురస్కారాలు లభించాయి. తాడేపల్లి గూడెంలోని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాలయంలో మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో కమిషనర్ కృష్ణ తేజ చేతుల మీదుగా పురస్కారాలు అందుకున్నారు. తాడిపత్రి మండలానికి చెందిన స్వచ్ఛ రథం ఆపరేటర్ రామ కేశవ, గాండ్లపెంట మండల ఆపరేటర్ బాబా ఫకృద్దీన్ల విశేష సేవలకు గాను వీరిని రాష్ట్ర స్థాయిలో నిలిచి ప్రశంసా పత్రాలు అందుకున్నారు. తాడిపత్రికి చెందిన రామకేశవ మండలంలోని గ్రామ పంచాయతీ ప్రజల నుంచి రోజూ పొడి చెత్త సేకరించి, దానికి బదులుగా వారికి నిత్యావసర సరుకులు అందజేస్తూ ప్లాస్టిక్ రహిత సమాజానికి కృషి చేయడంపై కమిషనర్ కృష్ణతేజ అభినందనలు తెలిపినట్లు జెడ్పీ సీఈఓ పి. విజయలక్ష్మి తెలిపారు.


