పేకాట రాయుళ్ల అరెస్ట్
ముదిగుబ్బ: ముదిగుబ్బలోని ఓ ఇంట్లో పేకాట ఆడుతున్న 17 మందిని శనివారం ధర్మవరం డీఎస్పీ హేమంత్‌కుమార్ ఆదేశాల మేరకు సీఐ శివరాముడు తన సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించి పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 86,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హేమంత్‌కుమార్ హెచ్చరించారు.
మద్యం మత్తులో
సొంతింటికే నిప్పు
ముదిగుబ్బ: మద్యం మత్తులో ఓ వ్యక్తి చేసిన ఘన కార్యంతో అతని సొంతిల్లే దగ్ధమైంది. వివరాలు.. మండల పరిధిలోని నక్కలపల్లికి చెందిన చాకలి నారాయణస్వామి మద్యానికి బానిసయ్యాడు. పూటుగా తాగి శుక్రవారం అర్ధరాత్రి ఇంటికి వచ్చిన అతను ఇంట్లో దుస్తులకు నిప్పు పెట్టాడు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున మంటలు వ్యాపించి ఇల్లు పూర్తిగా కాలిపోయింది. గ్రామస్తులు వెంటనే స్పందించి ఇంట్లోని గ్యాస్ సిలిండర్‌ను బయటకు తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది. రూ.లక్ష వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు విచారణ చేస్తున్నారు.
హజ్ యాత్రికులకు వ్యాక్సినేషన్
హిందూపురం టౌన్: హజ్ యాత్ర ముస్లింలకు అత్యంత పవిత్రమైనదని, జిల్లా నుంచి మక్కా సందర్శించే వారి యాత్ర క్షేమదాయకం కావాలని జిల్లా వైద్యారోగ్య శాఖాధికారిణి డాక్టర్ ఫైరోజా బేగం అన్నారు. జిల్లా నుంచి హజ్ యాత్రకు బయలుదేరుతున్న 161 మంది యాత్రికులకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని శనివారం పట్టణంలో నిర్వహించారు. హిందూపురం ప్రాంతం నుంచి 110 మంది యాత్రికులు హజ్‌కు వెళ్తున్నారని నిర్వాహకులు చెప్పారు. యాత్రికులు విదేశీ పర్యటనలో ఆయా దేశాలకు సంబంధించిన నియమ నిబంధనలు తప్పక పాటించాలన్నారు. అలాగే ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ముందుగానే తెలియజేయాలని, అక్కడికి వెళ్లి ఎలాంటి ఇబ్బందులు పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ మంజువాణి, డీఐఓ డాక్టర్ సురేషబాబు, వైద్యాధికారి డాక్టర్ కేసీకే నాయక్, వైద్యులు కిరణ్మయి, ఉషారాణి, హజ్ కమిటీ నూరుద్దీన్, వైద్య సిబ్బంది వన్నప్ప, ముస్తఫా, రమేష్, ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
రైలు కింద పడి
వ్యక్తి ఆత్మహత్య
హిందూపురం: స్థానిక కొట్నూరు–కగ్గల్లు రైల్వేగేట్ వద్ద శనివారం ఓ గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి బలవన్మరణం పొందినట్లు రైల్వే హెచ్‌సీ ఎర్రిస్వామి తెలిపారు. మృతుడు ఎరుపు, తెలుపు రంగు షర్టు, నీలం రంగు చెక్స్ లుంగీ ధరించాడన్నారు. కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు. సమాచారం తెలిసిన వారు హిందూపురం రైల్వే పోలీసు స్టేషన్ నం. 94412 38182, 91820 19510కు తెలియజేయాలని కోరారు.
బీటెక్ విద్యార్థి బలవన్మరణం
గార్లదిన్నె: బీటెక్ విద్యార్థి బలవన్మరణం పొందిన ఘటన మండల పరిధిలోని కమలాపురంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ మహమ్మద్ బాషా తెలిపిన మేరకు.. కమలాపురం గ్రామానికి చెందిన చింతబరరెడ్డి, జయలక్ష్మి దంపతుల కుమారుడు శ్రీకర్ రెడ్డి (21) బెంగళూరులో గీతం యూనివర్సిటీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఇటీవల స్వగ్రామం వచ్చాడు. శ్రీకర్ రెడ్డి మొదటి, ద్వితీయ సంవత్సరంలోని కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ అయినట్లు తెలిసింది. తోటి స్నేహితులు పాస్ కావడం, ఫైనల్ ఇయర్ పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో నిత్యం బాధపడుతుండేవాడని సమాచారం. ఈ క్రమంలో శనివారం తమ వ్యవసాయ తోటలో చీనీ చెట్లకు మందు పిచికారీ చేయడానికి తల్లిదండ్రులతో కలిసి వెళ్లిన శ్రీకర్ రెడ్డి పురుగు మందు తాగి అపస్మారక స్థితిలో పడిపోయాడు. కుటుంబ సభ్యులు 108 సాయంతో అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
పేకాట రాయుళ్ల అరెస్ట్
పేకాట రాయుళ్ల అరెస్ట్


