పొంచి ఉన్న ‘జల’గండం
మడకశిర: జిల్లాలోనే మడకశిర నియోజకవర్గం పూర్తిగా వ్యవసాయాధారిత ప్రాంతం. ఇక్కడి రైతులు చెరువులు, బోరు బావులపైనే ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. ఇటీవల బోరు బావుల్లో నీటి లభ్యత తగ్గుతుండడం ఆందోళన కలిగిస్తోంది. భూగర్భ జల మట్టం పడిపోతుండడమే ఇందుకు కారణమని రైతులు చెబుతున్నారు. మడకశిర విద్యుత్ డివిజన్ పరిధిలో మడకశిర, రొళ్ల, అగళి, గుడిబండ, అమరాపురం మండలాలు ఉన్నాయి. గత ఏడాది వర్షాలు ఆశించిన స్థాయిలో పడకపోవడంతో అన్ని చెరువులూ నిండలేదు. ప్రస్తుతం కొన్ని చెరువుల్లోనే కొంత మేర నీరు నిల్వ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే బోరు బావుల్లో నీటి లభ్యత తగ్గుతుండడం గమనార్హం.
కొత్తగా బోరు తవ్వకాలు..
వ్యవసాయ బోర్లలో నీటి మట్టం తగ్గుతుండడంతో రైతులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. సాగు చేసిన పంటలను కాపాడుకోవడానికి కొంత మంది రైతులు కొత్తగా బోరు తవ్వకాలకు శ్రీకారం చుడుతున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు రైతులు దాదాపు 120 బోర్లు కొత్తగా తవ్వించినట్లు తెలిసింది. ఓ బోరు బావి తవ్వించడానికే రూ.3.50 లక్షల వరకు ఖర్చు అవుతుంది. బోరు బావిలో నీరు లభిస్తే మోటార్ ఏర్పాటు చేయడానికి మరో రూ.3 లక్షలు రైతు భరించాల్సి ఉంటుంది. గత్యంతరం లేని పరిస్థితిలో అప్పులు చేసి మరీ రైతులు బోరు బావులు తవ్విస్తున్నారు.
వేసవిలో కష్టాలు తప్పవా..?
వేసవి ఇంకా ప్రారంభం కాకనే చాలా బోరుబావుల్లో నీటి లభ్యత తగ్గిపోయింది. భవిష్యత్తులో నీటి మట్టం మరింతగా పడి పోయే ప్రమాదం లేకపోలేదని పలువురు భావిస్తున్నారు. అంతేకాకుండా కొన్ని బోర్లు పూర్తిగా ఎండిపోయే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో పంటలను కాపాడుకోవడానికి రైతులు నానా తంటాలు పడాల్సి వస్తుంది. ప్రధానంగా వక్క తోటల రైతుల పరిస్థితి చాలా ఇబ్బందికరంగా మారనుంది.
బోరు బావుల్లో తగ్గుతున్న నీటి లభ్యత
పడిపోతున్న భూగర్భ జలమట్టం
ఆందోళనలో అన్నదాతలు
వేసవిని తలచుకుని హడలెత్తుతున్న వైనం
పొంచి ఉన్న ‘జల’గండం


