21 నుంచి గవిమఠం బ్రహ్మోత్సవాలు
ఉరవకొండ: కర్ణాటక సహా తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధిగాంచిన ఉరవకొండ గవిమఠం చంద్రమౌళీశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవ పోస్టర్లు, బ్రోచర్లను శనివారం గవిమఠం ఆవరణలో పీఠాధిపతులు జగద్గురు చెన్నబసవరాజేంద్రస్వామి, ఉత్తరాధికారి డాక్టర్ కరిబసవరాజేంద్రస్వామి, జిల్లా దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్, మఠం ఇన్‌చార్జ్ సహాయ కమిషనర్ గంజి మల్లికార్జున ప్రసాద్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా మల్లికార్జున ప్రసాద్ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల్లో భాగంగా 26న స్వామి వారి మహారథోత్సవం, 27న లంకాదహనం ఉంటాయన్నారు. భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వీరశైవ సంఘం నాయకులు పాటిల్ నిరంజన్‌గౌడ్, పాటిల్ రాజశేఖర్, మఠం సిబ్బంది నారాయణస్వామి, గోపి, మధు తదితరులు పాల్గొన్నారు.


