బాల్య వివాహాలను అరికట్టాలి
● కలెక్టర్ శ్యాంప్రసాద్ పిలుపు
● బాల్య వివాహముక్తి రథయాత్రకు శ్రీకారం
ప్రశాంతి నిలయం: బాల్యవివాహాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ పిలుపునిచ్చారు. బాల్య వివాహాలపై కలిగే అనర్థాలు వివరించి ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు సమత స్వచ్ఛంద సంస్థ 100 రోజుల ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. అందులో భాగంగా ఏర్పాటు చేసిన ప్రచార రథాన్ని శనివారం కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 2030 నాటికి భారత్‌ను బాల్య వివాహాలు లేని దేశంగా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రజల్లో అవగాహన పెంచడం ద్వారా బాల్య వివాహాలను పూర్తిగా అరికట్టవచ్చన్నారు. ప్రచార జాతాలో భాగంగా బాల్య వివాహాల చట్టం 2006 గురించి, శిక్షల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని సిబ్బంది సూచించారు. ఎక్కడైనా బాల్య వివాహం జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే చైల్డ్ హెల్ప్‌లైన్ (1098)కు, పోలీసులకు (112) ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ సువర్ణ, డీఎస్పీ ఇందిర, సమత స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ ఆదినారాయణరెడ్డి, బాలల పరిరక్షణ అధికారి మహేష్, సెక్రెటరీ వెంకటేషు, మనోహర్, ఉమా శంకర్‌రెడ్డి, సునీత, శారద, కళావతి తదితరులు పాల్గొన్నారు.
ప్రశాంతంగా
నవోదయ ప్రవేశ పరీక్ష
లేపాక్షి: జవహర్ నవోదయ విద్యాలయంలో 9, 11వ తరగతుల్లో ప్రవేశానికి శనివారం నిర్వహించిన పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశం కోసం 1,210 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 1,020 మంది విద్యార్థులు హాజరయ్యారని ప్రిన్సిపాల్ నాగరాజు తెలిపారు. అలాగే 9వ తరగతిలో ప్రవేశం కోసం 828 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 500 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్టు ఆయన వెల్లడించారు.


