ఫైవ్‌మెన్‌ కమిటీ పెత్తనమేంటి? | - | Sakshi
Sakshi News home page

ఫైవ్‌మెన్‌ కమిటీ పెత్తనమేంటి?

Feb 8 2026 4:24 AM | Updated on Feb 8 2026 4:24 AM

ఫైవ్‌

ఫైవ్‌మెన్‌ కమిటీ పెత్తనమేంటి?

పరిగి: ‘‘ప్రభుత్వ కార్యక్రమాల్లో టీడీపీ నియమించిన ఐదుగురు సభ్యుల (ఫైవ్‌మెన్‌) కమిటీ పెత్తనమేంటి.. ప్రజాప్రతినిధులకు ఉన్న అధికారాన్ని వారికి ఎవరిచ్చారు. అసలు ఫైవ్‌మెన్‌ కమిటీని ఎవరు ఎన్నుకున్నారు. ఆ కమిటీతో ప్రజాప్రతినిధులైన సర్పంచ్‌, ఎంపీటీసీలకు గౌరవం కొరవడింది. అధికారులు కూడా ప్రొటోకాల్‌ పాటించకుండా ఆ కమిటీ సభ్యులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇది నిబంధనలకు విరుద్ధం. క్షమించరాని నేరం’’ అంటూ పరిగి మండల సభలో ఎంపీటీసీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయ సమావేశ భవనంలో ఎంపీపీ సవిత అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ప్రారంభమైన పది నిమిషాలలోపే సభలో గందరగోళ వాతావరణం నెలకొంది. టీడీపీ ఫైవ్‌ మెన్‌ కమిటీ గురించి ఎంపీటీసీ మారుతి ప్రస్తావిస్తూ.. వారి పెత్తనంపై నిలదీయగా.. మిగతా సభ్యులు కూడా ఆయనకు మద్దతుగా నిలిచారు. దీంతో సభలో గందరగోళం నెలకొనగా ఎంపీటీసీలు సభ నుంచి వాకౌట్‌ చేసి కార్యాలయం ఎదుట బైఠాయించారు. అనంతరం అధికారులు సభ్యులకు నచ్చజెప్పడంతో పాటు ఎంపీపీ సవిత జోక్యంతో సమావేశం పునఃప్రారంభమైంది.

బిల్లులు మంజూరు టీడీపీ సర్పంచులకేనా?

పంచాయతీలకు ఉన్న అధికారాన్ని విస్మరించి టీడీపీ సానుభూతిపరులుగా ఉన్న సర్పంచ్‌లకు మాత్రమే అభివృద్ధి పనుల బిల్లులు మంజూరు చేయడంపై సభ్యులు మండిపడ్డారు. మండలంలోని 14 పంచాయతీల్లో కేవలం బీచిగానిపల్లి పంచాయతీకి మాత్రమే బిల్లులు మంజూరు చేయడంపై అభ్యంతం తెలిపారు. బిల్లుల మంజూరులో డిప్యూటీ ఎంపీడీఓ అవలంబిస్తున్న ధోరణి సరికాదన్నారు. మంత్రి సవిత ఆదేశాలతో విధులు నిర్వహిస్తున్న డిప్యూటీ ఎంపీడీఓ... పదవికి రాజీనామా చేసి పచ్చకండువా కప్పుకోవాలన్నారు. వచ్చేవారంలో బిల్లులు మంజూరు చేయకపోతే కార్యాలయం ఎదుట ధర్నా చేపడతామని హెచ్చరించారు. దీంతో తహసీల్దారు, ఎంపీడీఓ స్పందించారు. కచ్చితంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

కొనుగోలు కేంద్రాలు లేనట్టేనా?

రైతులకు మద్దతు ధర దక్కేలా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వం నేటికీ చర్యలు తీసుకోలేదని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మొక్కజొన్న పంటకు గిట్టుబాటు ధర లేక కనీసం కూలీ ఖర్చులు సైతం రాక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. 5 కిలోల మొక్కజొన్న విత్తనాలు రూ.1,500 ఉంటే, రైతులు పండించిన పంట వంద కేజీలు రూ.1,500 పలకడం దారుణమన్నారు. కార్యక్రమంలో తహసీల్దారు హసీనాసుల్తానా, ఎంపీడీఓ రెడ్డెప్ప, వైస్‌ ఎంపీపీలు వేదవతి, శకుంతలమ్మ, జెడ్పీటీసీ శ్రీరామప్ప, మండల అధికారులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

పరిగి మండల సభలో సభ్యుల నిలదీత

ప్రొటోకాల్‌ పాటించని అధికారులపై ఆగ్రహం

ఎంపీపీ జోక్యంతో కొనసాగిన

సమావేశం

ఫైవ్‌మెన్‌ కమిటీ పెత్తనమేంటి? 1
1/1

ఫైవ్‌మెన్‌ కమిటీ పెత్తనమేంటి?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement