పేదింట క్రీడా ఆణిముత్యం | - | Sakshi
Sakshi News home page

పేదింట క్రీడా ఆణిముత్యం

Feb 8 2026 4:24 AM | Updated on Feb 8 2026 4:24 AM

పేదిం

పేదింట క్రీడా ఆణిముత్యం

తాడిమర్రి:పేదింట క్రీడా ఆణిముత్యం మెరిసింది. బాల్‌ బ్యాడ్మింటన్‌ క్రీడలో ఏకంగా అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటి పలువురి చేత శభాష్‌ అనిపించుకుంది. వివరాలు.. తాడిమర్రి మండలంలోని ఆత్మకూరు గ్రామానికి చెందిన మందల ఈరప్ప, శివమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు సంతానం. దంపతులిద్దరూ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరి పెద్ద కుమార్తె పావని బీఎస్సీ వరకు చదివింది. పావని ఒకవైపు చదువులో రాణిస్తూనే మరోవైపు బాల్‌ బ్యాడ్మింటన్‌ క్రీడలో రాణిస్తోంది.

పాఠశాల స్థాయి నుంచే..

పాఠశాల స్థాయి నుంచి తాను ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ సత్తా చాటిన పావని 2015లో కర్నూలులో జరిగిన రాష్ట్రస్థాయి టోర్నమెంట్‌కి ఎంపికై ంది. 2016లో శ్రీకాకుళంలో సబ్‌ జూనియర్‌ బాల్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో పాల్గొని ప్రతిభ కనబరిచింది. 2017లో తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్‌, విశాఖపట్నంలో జాతీయ స్థాయిలో జరిగిన పోటీల్లో పాల్గొంది. 2017లో సీనియర్‌ విభాగంలో కర్నూల్‌, 2018లో గుంటూరులో జరిగిన సీనియర్స్‌ బాల్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో ఆడింది.

ఆటకు విరామమిచ్చినా..

బీఎస్సీ నర్సింగ్‌ కోర్సులో చేరడంతో నాలుగేళ్లు విరామం తీసుకున్న అనంతరం తిరిగి ఆట ప్రారంభించిన పావని రెట్టించిన ఉత్సాహంతో దూసుకెళ్లడం ప్రారంభించింది. ఉమ్మడి జిల్లా తరఫున సీనియర్‌ విభాగంలో జరిగిన రాష్ట్ర బాల్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ ఎంపికైంది. 2025–2026లో ప్రకాశం జిల్లా చేవూరులో జరిగిన పోటీల్లో సత్తా చాటి జాతీయ స్థాయి టోర్నమెంట్‌కు ఎంపికై ంది. తమిళనాడులోని దిండిగల్‌లో జరిగిన జాతీయ స్థాయి టోర్నమెంట్‌లో ఉత్తమ ఆటతీరుతో తృతీయ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది జనవరి 1 నుంచి 5 వరకు నేపాల్‌ రాజధాని ఖాట్మండులో జరిగిన అంతర్జాతీయ టెస్టు సిరీస్‌లో అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శించింది. బంగారు పతకం సాధించి దేశం మొత్తం గర్వించేలా చేసింది. ఇప్పటివరకూ పావని 11 సార్లు రాష్ట్రస్థాయి టోర్నమెంట్లు, 3 సార్లు జాతీయ స్థాయి టోర్నమెంట్లు, ఒకసారి అంతర్జాతీయ స్థాయిలో పాల్గొనడం గమనార్హం. అంతర్జాతీయ స్థాయిలో కూడా రాణించి ఆత్మకూరు గ్రామానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టడంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. గ్రామస్తులు పావనికి శుభాకాంక్షలు తెలుపుతూ అభినందిస్తున్నారు.

బాల్‌ బ్యాడ్మింటన్‌ క్రీడలో

దూసుకెళ్తున్న పావని

అంతర్జాతీయ పోటీల్లో

దేశం తరఫున ప్రాతినిధ్యం

అత్యుత్తమ ఆటతో జిల్లాకు ఖ్యాతి

అసోసియేషన్‌ పెద్దల ప్రోత్సాహంతోనే

మాది చిన్నపాటి వ్యవసాయ కుటుంబం. నాతో పాటు, నా చెల్లెల చదువుల కోసం మా తల్లిదండ్రులు అవస్థలు పడుతున్నారు. స్కూల్‌ గేమ్స్‌లో చక్కటి ఆటతీరు చూపుతున్న నాపై అసోసియేషన్‌ జాతీయ కార్యదర్శి రాజారామ్‌, రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు విజయ శంకర్‌రెడ్డి, బాలాజీ, ఉపాధ్యక్షులు గౌస్‌మొహిద్దీన్‌, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఈశ్వరయ్య, వెంకటేష్‌ నమ్మకం ఉంచారు. ముందుండి ప్రోత్సహిస్తూ ఆర్థిక సహకారం అందించారు. ప్రభుత్వం చేయూతనిస్తే మరింతగా రాణిస్తాననే నమ్మకముంది. – పావని

పేదింట క్రీడా ఆణిముత్యం 1
1/1

పేదింట క్రీడా ఆణిముత్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement