‘పది’లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి
పుట్టపర్తి అర్బన్: పదో తరగతిలో ఈసారి వందశాతం ఉత్తీర్ణత సాధించేలా విద్యార్థులను సిద్ధం చేయాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఉపాధ్యాయులను ఆదేశించారు. శనివారం ఆయన పుట్టపర్తి ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఫలితాల మెరుగునకు అమలు చేస్తున్న వంద రోజుల ప్రణాళిక అమలు తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులకు ప్రశ్నలు సంధించి సమాధానాలు రాబట్టారు. వందరోజుల ప్రణాళికలో భాగంగా ఏర్పాటు చేసే క్లాసులకు విద్యార్థులందరూ హాజరు కావాలన్నారు. ఏదైనా కారణం చేత పాఠశాలకు రాలేని విద్యార్థులు సమీపంలోని హాస్టళ్లకు అనుసంధానించాలన్నారు. వందశాతం ఉత్తీర్ణత సాధించడానికి ప్రతి ఉపాధ్యాయుడూ కృషి చేయాలన్నారు.
పారిశుధ్యం మెరుగుపరచాలి
ప్రశాంతి నిలయం: గృహ నిర్మాణం, పట్టణ మౌలిక వసతుల కల్పన, పారిశుధ్యం మెరుగునకు అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఆదేశించారు. శనివారం ఆయన కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జేసీ మౌర్య భరద్వాజ్‌తో కలిసి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... జిల్లాలో డోర్ టు డోర్ చెత్తసేకరణ వందశాతం జరగాలన్నారు. వ్యర్థాలు వేరు చేసి తరలించడం, ప్రాసెసింగ్ తప్పనిసరిగా అమలు చేయాలన్నారు. ప్రతి మున్సిపాలిటీలోనూ రైతు బజార్లను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. టిడ్కో కింద జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలకు 4,176 ఇళ్లు మంజూరయ్యాయన్నారు. వివరాలన్నీ క్షుణ్ణంగా పరిశీలించి లబ్ధిదారులను ధ్రువీకరించాలన్నారు. మున్సిపాలిటీలోని వీధి దీపాలు, తాగునీరు, రహదారులు, పారిశుధ్య సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్లు, డీఈఈలు, టిడ్కో అధికారులు హాజరయ్యారు.
గుండెపోటుతో
హెచ్‌ఎం శ్రీనివాసరెడ్డి మృతి
పుట్టపర్తి: బుక్కపట్నం మండలం గూనిపల్లి ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం పి.శ్రీనివాసరెడ్డి (57) గుండె పోటుతో శనివారం మృతి చెందారు. విధుల్లో ఉన్న సమయంలోనే ఆయకు ఛాతీలో నొప్పి రావడంతో ఎంఈఓ గోపాల్ నాయక్ హుటాహుటీన సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే శ్రీనివాసరెడ్డి మృతి చెందినట్లు నిర్ధారించారు. సౌమ్యుడు, అంకిత భావంతో పనిచేసే శ్రీనివాసరెడ్డి ఆకస్మిక మృతితో స్వగ్రామం ఎనుములపల్లిలో విషాదం నెలకొంది. ఆయన భార్య రాధిక బుక్కపట్నం మండలం బుచ్చయ్యగారిపల్లి ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. శ్రీనివాసరెడ్డి కుటుంబం ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉంది. ఆయన తండ్రి సత్యనారాయణరెడ్డి అనేక ఏళ్లుగా సర్పంచుగా సేవలందించి గుర్తింపు పొందారు. అలాగే శ్రీనివాసరెడ్డి చిన్నాన్న రమణారెడ్డి ఎస్కేయూ ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్ హెడ్‌గా పని చేశారు. శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి ఫోన్‌లో పరామర్శించారు.
‘పది’లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి


